IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో నేడు టీమిండియా రెండో వన్డేలో తలపడనుంది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా కేవలం మూడు పరుగుల తేడాతోనే భారత్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆదివారం సమష్టిగా రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో కనిపిస్తోంది. అటు తొలి వన్డేలో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని చేజార్చి చింతిస్తున్న వెస్టిండీస్ రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైతే సిరీస్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో వెస్టిండీస్ తెగించి ఆడేందుకు సిద్ధంగా ఉంది. గత వన్డేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజు శాంసన్ వరుసగా విఫలమయ్యారు. ఈ వన్డేలో మిడిలార్డర్ కుదురుకోవాలని భారత్ ఆశిస్తోంది.
Read Also: Vishnu Vishal: భర్త నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గుత్తా జ్వాల
దాదాపుగా తొలి వన్డే జట్టుతోనే రెండో వన్డేలో భారత్ బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను మార్చాలని టీమ్ భావిస్తే అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా అవేష్ ఖాన్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వొచ్చు. కాగా గత ఏడు వన్డేల్లో వెస్టిండీస్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో వరుస పరాజయాలకు చెక్ చెప్పాలని పూరన్ సేన భావిస్తోంది. తొలి వన్డేలో బంతి పాతబడిన తర్వాత వెస్టిండీస్ బౌలర్లు గొప్పగా రాణించి టీమిండియా భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. మరి రెండో వన్డేలో విండీస్ బౌలర్లు ఏం చేస్తారో వేచి చూడాలి. అటు బ్యాటింగ్ హోప్, పూరన్, బ్రెండన్ కింగ్, బ్రూక్స్, కైల్ మేయర్స్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.