Site icon NTV Telugu

Womens Asia Cup 2022: నేటి నుంచి మహిళల ఆసియా కప్.. శ్రీలంకతో భారత్‌ తొలిపోరు

Womens Asia Cup

Womens Asia Cup

Womens Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ ఆడనుంది. శనివారం జరుగనున్న తొలి పోరులో శ్రీలంకతో టీమ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో మన అమ్మాయిలు నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నా.. ఆసియా వరకైతే హర్మన్‌ప్రీత్‌ బృందం ఫేవరెట్‌ అనే చెప్పొచ్చు. 2004 నుంచి 2018 వరకు ఏడుసార్లు మహిళల ఆసియా కప్‌ జరగగా.. అందులో ఆరుసార్లు భారత్‌ విజయం సాధించడం విశేషం. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు టీ20 ఫార్మాట్‌లో రెండు సార్లు టైటిల్‌ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం బంగ్లాదేశ్‌పై ఓటమి పాలైంది.

నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. శనివారమే ఈ టీ20 టోర్నీకి తెరలేవనుంది. ఏడు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఆతిథ్య బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ పోరుతో మొదలవనుంది. 2020లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా పడి, ఆ తర్వాత రద్దయింది. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో విజయం సాధించేందుకు పలు దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఆఖరి వన్డేలో ‘మన్కడింగ్‌’తో వార్తల్లోకెక్కిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. అవన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టిపెట్టేందుకు సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. టీమిండియా ఇవాళ శ్రీలంకతో మ్యాచ్ తర్వాత వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్‌ (7న), బంగ్లాదేశ్‌ (8న), థాయ్‌లాండ్‌ (10న) జట్లతో తలపడుతుంది.

Sourav Ganguli: బుమ్రా టీ20 వరల్డ్‌ కప్‌కు దూరం కాలేదు

మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుంది. రౌండ్ రాబిన్‌ ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. ఒక్కో జట్టు మిగతా ఆరింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్‌లో తలపడతాయి. ప్రస్తుతం భారత జట్టు పటిష్టంగా ఉంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మందన అద్భుత ఫామ్‌లో ఉండగా.. వారికి తోడుగా జెమీమా రోడ్రిగ్స్ చేరడంతో జట్టు మరింత పటిష్టంగా మారింది. గత ఆసియా కప్‌ ఫైనల్‌ను పక్కన పెడితే మరోసారి భారత్ కప్‌ను దక్కించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. అబ్బాయిలు ఆసియా కప్‌లో నిరాశపరిచినా.. మరి అమ్మాయిలైనా సాధిస్తారో వేచి చూడాల్సిందే!.

Exit mobile version