IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?

India Vs Sri Lanka Asian Games 2026

India Vs Sri Lanka Asian Games 2026

India vs Sri Lanka Asian Games 2026 Weather Report: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీలకు వరుణుడి అడ్డంకులు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌ వర్షం కారణంగా ప్రభావితమవుతోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో.. టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మిగిలిన మూడు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

ఇక సెమీఫైనల్లో భారత్, శ్రీలంక గురువారం (అక్టోబర్ 1) తలపడనున్నాయి. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్‌కు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. మ్యాచ్‌ సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉండగా.. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉండనుంది. వర్షం కురిసే అవకాశం కేవలం ఒక శాతమే. దీంతో సెమీఫైనల్‌ మ్యాచ్‌ పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

అయితే వర్షం కారణంగా భారత్, శ్రీలంక సెమీఫైనల్‌ కూడా రద్దైతే.. నిబంధనల ప్రకారం టీమిండియా ఫైనల్‌కు చేరుతుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు శ్రీలంక కంటే మెరుగైన ర్యాంకు ఉండటమే ఇందుకు కారణం. గత ఆసియా క్రీడల్లో శ్రీలంక క్వార్టర్‌ఫైనల్‌ దశలోనే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్‌తో సెమీఫైనల్లో తలపడుతోంది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బంగ్లాదేశ్, మలేషియా మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ కూడా వర్షం కారణంగా రద్దైంది. దీంతో రెండు సెమీఫైనల్స్‌ అక్టోబర్‌ 1న జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ తలపడగా.. అనంతరం భారత్-శ్రీలంక పోరు జరగనుంది.

పురుషుల క్రికెట్‌లో 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో మెరుగైన ర్యాంకు ఆధారంగా భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. ఇప్పుడు మరోసారి స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల విభాగంలోనూ భారత జట్టు ఇప్పటికే స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.