Site icon NTV Telugu

IND Playing 11 vs SA: దక్షిణాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌.. టీమిండియాలో ఊహించని మార్పు?

Ind Playing 11 Vs Sa

Ind Playing 11 Vs Sa

India playing XI vs South Africa: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా సూపర్‌-8కు చేరుకుంది. సూపర్‌-8లో ఆదివారం (ఫిబ్రవరి) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు టీమిండియా కాంబినేషన్‌లో భారీ మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి జట్లు భారత జట్టులోని లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లను ఆఫ్‌ స్పిన్నర్లతో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కొత్త వ్యూహాలపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ రైన్ టెన్ డస్కటే వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తాజాగా రైన్ టెన్ డస్కటే మాట్లాడుతూ… ‘భారత జట్టులో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లలో మంచి ఎంపికలు ఉన్నాయి. ముఖ్యంగా సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఉన్నాడు. నంబర్-3 స్థానంలో ఆడిన అనుభవం సంజుకు ఉంది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం అతడికి ఉంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు’ అని చెప్పాడు. సంజు టెక్నిక్, టెంపరమెంట్ మిడిల్ ఓవర్‌లలో కీలక పాత్ర పోషించగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా లాంటి కీలక మ్యాచ్ ముందు జట్టులో అతనికి అవకాశం ఇవ్వాలనే చర్చలు జోరందుకున్నాయి.

ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న తిలక్ వర్మ స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే.. తిలక్ స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సూపర్‌-8 వంటి కీలక దశలో సరైన కాంబినేషన్ ఎంపిక చాలా ముఖ్యం. కాబట్టి ప్రత్యర్థి బౌలింగ్‌కు తగిన బ్యాటింగ్ లైనప్‌ను ఎంపిక చేయడంలో టీమ్ మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మ్యాచ్ రోజునే అసలు ప్లానింగ్ ఏంటో తేలనుంది. సంజు గత ఇన్నింగ్స్‌లో 8 బంతుల్లో 22 రన్స్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సిక్సులు, ఓ ఫోర్ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు తిలక్ స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉండడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేస్తోంది.

Exit mobile version