NTV Telugu Site icon

ఇండియా వర్సెస్‌ పాక్‌ హైటెన్షన్‌ మ్యాచ్‌…

ఏ జట్ల మధ్య మ్యాచ్‌ కోసం… యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్‌ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ జరుగుతుంటే… క్రికెట్‌ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్‌ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది దేశంతో మ్యాచ్‌ అంటే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సిందే. ఓ టీమ్ ఓడినా… యావత్‌ దేశం పరువు గంగలో కలిసినట్టుగా ఫీల్‌ అవుతారు. అదే… ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యచ్‌.

రెండేళ్ల తర్వాత ఇండియా పాక్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌. చివరగా జూన్‌ 16, 2019 లో న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌లో ఇండియా, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. క్వార్టర్‌ ఫైనల్‌ లో ఇండియా… పాక్‌ను చిత్తుగా ఓడించింది. 89 రన్స్‌ తేడాతో… పాక్‌ పై ఇండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ తర్వాత… ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఈ దాయాది దేశాలు తలపడబోతున్నాయి.

ఈనెల 24వ తేదీ కోసం యావత్‌ క్రీడా లోకం ఎదురుచూస్తోంది…. ఈ సూపర్‌ సండే కోసం క్రికెట్‌ లవర్స్‌ తెగ తొందరపడుతున్నారు… !! ఎందుకు… ఏమిటి… ఏం జరగనుంది అనుకుంటున్నారా..! దుబాయ్‌ వేదికగా దాయాదుల మధ్య సమరం జరగబోతోంది. టీ20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా.. ఇండియా పాకిస్తాన్‌ మధ్య హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది.

పాకిస్తాన్‌ ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో ఇండియాని ఓడించింది లేదు. వరల్డ్‌ కప్‌లో ఇండియా పాక్‌ 7 సార్లు తలపడగా… పాక్‌ ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గలేదు. ఏడు మ్యాచ్‌ల్లోనూ ఇండియాదే విజయం. టీ20 వరల్డ్‌ లో భాగంగా ఇప్పటివరకు రెండు దేశాలు 5 సార్లు హెడ్‌ టు హెడ్‌ తలపడగా… ఇండియా 4-0 తో ఆధిక్యం లో ఉంది. మరో మ్యాచ్‌ రద్దైంది. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాలు తలపడనున్నాయి.

ఈనెల 24న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికంగా జరగనున్న ఇండియా పాక్‌ మ్యచ్‌ టికెట్లను ఐసీసీ 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంచింది. సైట్‌ లో ఉంచిన గంటలోపే టికెట్లన్నీ ఐపోయాయి అంటేనే తెలుస్తోంది… ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో.