Site icon NTV Telugu

India vs England: వరుణుడి అంతరాయం.. దెబ్బకు లంచ్ బ్రేక్

India Vs England

India Vs England

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. నిజానికి.. మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందునుంచే వాతావరణంలో తేడాలు కనిపించడంతో, వర్షం రావొచ్చని అంచనా వేశారు. అనుకున్నట్టే.. వరుణుడు కారుమబ్బుల్ని వెంటేసుకొని వచ్చాడు. తొలుత కాసేపు బ్రేక్ ప్రకటించిన అంపైర్లు.. వాతావరణ మార్పుల దృష్ట్యా లంచ్ బ్రేక్‌గా ప్రకటించారు. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించనున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.

తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. తొలుత ఓపెనర్లు క్రీజులో కుదుర్కుకున్నట్టు అనిపించారు కానీ.. అండర్సర్ బౌలింగ్‌లో శుభ్మన్ గిల్ (17) అనూహ్యంగా ఔట్ అయ్యాడు. క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపయ్యాక పుజారా (13) సైతం ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (1), హనుమ విహారి (14) ఉన్నారు. ఇకపై వికెట్లు కోల్పోకుండా భారత్ నిలకడగా రాణిస్తే.. ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచినట్లవుతుంది.

కాగా.. గతేడాదిలోనే జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాది జులై 1కి రీషెడ్యూల్ చేశారు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఒకటి డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ ఒకటి గెలవగా.. రెండు విజయాలతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా, భారత్ గెలిచినా.. సిరీస్ భారత్‌దే. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. 2-2తో సిరీస్ సమం అవుతుంది.

Exit mobile version