Site icon NTV Telugu

IND T20 Records: టీ20ల్లో భారత్‌ అరుదైన రికార్డు.. ఏకంగా 44 సార్లు, ఏ జట్టుకు సాధ్యం కాలే!

India T20 Records

India T20 Records

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టీ20ల్లో భారత్‌ మొత్తం 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. నాగపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 238 పరుగులు చేయడంతో టీమిండియా ఖాతాలో ఈ రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు 200కు పైగా స్కోర్లు చేయలేదు. బ్యాటింగ్‌లో భారత జట్టు స్థిరత్వం, లోతైన బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. ప్రత్యర్థి జట్ల వారీగా చూస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్‌ అత్యధికంగా 8 సార్లు 200+ స్కోర్లు చేసింది.

దక్షిణాఫ్రికా తర్వాత ఆస్ట్రేలియాపై 7 సార్లు 200+ స్కోర్లు చేసింది. శ్రీలంకపై 6 సార్లు ఈ ఘనతను సాధించింది. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌లపై 5 సార్లు 200కి పైగా పరుగులు చేసింది. వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, అఫ్గానిస్తాన్‌లపై 3 సార్లు ఈ మార్క్‌ను దాటింది. బంగ్లాదేశ్‌పై 2 సార్లు.. జింబాబ్వే, నేపాల్‌పై ఒక్కసారి 200+ స్కోర్లను భారత్ సాధించింది. ఈ గణాంకాలు చూస్తే టీమిండియా బ్యాటింగ్ పవర్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.

Also Read: Mogudu Title Promo: మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం.. విశాల్‌ ‘మొగుడు’ ప్రోమో అదుర్స్!

టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్, ఫినిషర్ల వరకు ప్రతి ఒక్కరూ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా దూకుడుగా ఆడగలగడం భారత్‌కు ప్రధాన బలం. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు, ఆల్‌రౌండర్ల ప్రభావంతో భారత జట్టు ఏ సమయంలోనైనా భారీ స్కోరు చేసే స్థాయికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026కి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీసులో ఇలాంటి రికార్డులు టీమిండియాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయమని క్రికెట్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Exit mobile version