Site icon NTV Telugu

నేడు రెండో వన్డే.. గెలుపు కోసం టీమిండియా ఆరాటం

దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. పార్ల్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. రెండో వన్డేలో అయినా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా మిగతా వారు ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా ఓటమి పాలు కాక తప్పలేదు.

Read Also: టీమిండియాకు మ‌రో షాక్‌.. ఒక్క‌రికి కూడా ద‌క్క‌ని చోటు

ముఖ్యంగా జట్టు ఎంపిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సవాల్‌గా మారింది. ఆల్‌రౌండర్ కేటగిరిలో తీసుకున్న వెంకటేష్ అయ్యర్ చేత తొలి వన్డేలో బౌలింగ్ వేయించకపోవడంపై విమర్శల వర్షం కురిసింది. అతడితో బౌలింగ్ వేసే ఉద్దేశం లేనప్పుడు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని తీసుకుంటే సరిపోయేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిఖారైన ఆల్‌రౌండర్లు పాండ్యా, రవీంద్ర జడేజా లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లలో ఒకరు రాణించడం, కోహ్లీ బాగా ఆడటంతో పాటు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు.

మరోవైపు పార్ల్ వేదికలో వేడి ఎక్కువ ఉండ‌టంతో పిచ్ పొడిగా మారే అవ‌కాశం ఉంది. దీంతో పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీల‌కం కానుంది. టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కారణంగా బ్యాటింగ్ కష్టతరంగా మారే ఛాన్స్ ఉంది. తొలి వన్డేలో ఇదే జరగడంతో భారత్ ఓటమి పాలైంది.

Exit mobile version