Indian Players Performance in T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ప్రతి ఆటగాడు జట్టుకు కీలకంగా నిలిచాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు, సీనియర్లు కలిసి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ టోర్నీలో భారత జట్టు ప్రతి విభాగంలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచి చాంపియన్స్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్ ప్లేయర్స్ ఫుల్ పెర్ఫామెన్స్ ఎలా ఉందో ఓసారి చూద్దాం.
బ్యాటింగ్ విభాగంలో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. మొత్తం టోర్నీలో 321 పరుగులు చేసి జట్టుకు బలమైన ఇన్నింగ్స్‌లు అందించాడు. ఇషాన్ కిషన్ 327 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 242 పరుగులతో కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. తిలక్ వర్మ 218 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని అందించాడు. అభిషేక్ శర్మ నిరాశపర్చినా.. కీలక ఫైనల్లో రెచ్చిపోయాడు. మొత్తంగా 141 పరుగులతో తన ప్రతిభను చాటుకున్నాడు.
ఆల్‌రౌండర్ పాత్రలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కీలక పాత్ర పోషించారు. హార్దిక్ 237 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టి జట్టుకు అమూల్యమైన సేవలు అందించాడు. దూబే 235 పరుగులతో పాటు 5 వికెట్లు తీసి జట్టుకు సహాయపడ్డాడు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించారు. ఈ ఇద్దరూ చెరో 14 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. అక్షర్ పటేల్ 11 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ 9 వికెట్లు తీసి పేస్ దళానికి బలం చేకూర్చాడు.
మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రింకూ సింగ్ 24 రన్స్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో 11 పరుగులు చేశాడు. ఈ నలుగురికి ఎక్కువగా ఆడే అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో రాణించి సత్తాచాటారు. ఇలా టీమిండియా ఆటగాళ్లు ప్రతి విభాగంలో తమ వంతు పాత్ర పోషించడంతో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026లో చాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం లిఖించబడింది.
