Site icon NTV Telugu

IND Vs ENG: రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ విఫలం.. పుజారా హాఫ్ సెంచరీ

Virat Kohli Min

Virat Kohli Min

బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో 257 పరుగుల ఆధిక్యం సంపాదించింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (50), రిషబ్ పంత్ (30) ఉన్నారు. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ మళ్లీ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 136 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. తెలుగు క్రికెటర్ హనుమా విహారి (11) కూడా రాణించలేదు.

Read Also: Femina Miss India 2022: మిస్ ఇండియాగా సినిశెట్టి

కాగా 84/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో హీరోగా నిలిచాడు. అతడు140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేసి సెంచరీతో తన జట్టును ఆదుకున్నాడు. ఈ ఏడాది బెయిర్‌స్టోకు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. స్టోక్స్ (25), బిల్లింగ్స్ (36)తో కలిసి బెయిర్ స్టో ఇంగ్లండ్‌కు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌కు 4, బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. షమీ 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.

Exit mobile version