NTV Telugu Site icon

ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర…

ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు.

టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం ఇదే మొదటిసారి. ఇక బ్యాడ్మింటన్లో స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెల్చుకుంది. బాక్సింగ్ లో లవ్లీనా పతకాన్ని ఖాయం చేసింది. హాకీలో చాన్నాళ్ల తర్వాత అటు పరుషులు, ఇటు మహిళల టీములు సెమీస్ లో అడుగుపెట్టి ఆశలు రేపుతున్నాయి. ఇవన్నీ సంతోషించాల్సిన ఘనతలే. కానీ మన దేశ జనాభాను, ఆర్థిక స్థితిగతుల్ని, ఇతరత్రా ప్రతిపదికల్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. ఇండియా అంటే ఇంతేనా అనిపిస్తోంది.

ఒలింపిక్స్ లో భార‌త బృందం మెరుపుల క‌న్నా, రిక్త హ‌స్తాల‌తో వెనుదిర‌గ‌డ‌మే ఎక్కువగా ఉంది. గ‌తంలో క‌న్నా ఎక్కువ మంది అథ్లెట్లతో ఒలింపిక్స్ కు హాజరైనా.. పాతకథే పునరావృతమౌతోంది. తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయిచాను రజతంతో శుభారంభం చేసినా.. ఆ తర్వాత జోరు తగ్గింది. బాక్సింగ్ లో లవ్లీనా, బ్యాడ్మింటన్ లో పీవీ సింధు మినహా ఫేవరెంట్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చరీ, షూటింగ్ లో ఒక్క పతకం కూడా దక్కలేదు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో పతకాలు కొల్లగొట్టిన ఆర్చర్లు, షూటర్లు.. ఒలింపిక్స్ లో మాత్రం చేతులెత్తేయడం విస్మయం కలిగించింది. టెన్నిస్ లో ఛాంపియన్ ప్లేయర్లు ఉన్నా.. ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. రెజ్లింగ్ లోనూ నిరాశే మిగిలింది. జాతీయ క్రీడ హాకీలో 49 ఏళ్ల తర్వాత పురుషుల జట్టు సెమీస్ చేరడం, మహిళల జట్టు చరిత్రలో తొలిసారిగా సెమీస్ కు వెళ్లడం మాత్రం కాస్త ఊరట కలిగించే పరిణామాలు.

నిజానికి, ఇప్పటి వరకు గడచిన 24 ఒలింపిక్స్‌లలో మనం సాధించినవి 30 పతకాలే. ఒలింపిక్స్‌కు వెళ్ళే మన అథ్లెట్ల సంఖ్యకూ, సాధిస్తున్న పతకాలకూ మధ్య నిష్పత్తి ఏమంత గొప్పగానూ లేదు. అయిదేళ్ళ క్రితం 2016లో బ్రెజిల్‌ రాజధాని రియో డిజనీరోలో జరిగిన ఒలింపిక్స్‌ అందుకు ఓ మచ్చుతునక. అప్పట్లో మన దేశం నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది అథ్లెట్లు వెళితే, ఇద్దరే పతకాలతో తిరిగొచ్చారు. కానీ, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 80 మంది వెళ్ళినా, అరడజను పతకాలు వచ్చాయి. పదమూడేళ్ళ క్రితం 2008 నాటి బీజింగ్‌ ఒలింపిక్స్‌కు మన దేశం నుంచి దాదాపు 55 మంది అథ్లెట్లే వెళితే, మూడు పతకాలు వచ్చాయి. భారత్‌కు ఇప్పటి వరకు వ్యక్తిగత పోటీల్లో దక్కిన ఏకైక బంగారు పతకం అప్పుడే లభించింది. రైఫిల్‌ షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా సాధించిన స్వర్ణం అది. అలా ఆసారి మనం పతకాల పట్టికలో 51వ స్థానంలో నిలిచాం. ఆ తరువాత మాత్రం పతకాల పట్టికలో మన స్థానం కిందకే వెళ్ళింది. ఇన్ని కోట్ల జనాభా ఉన్న భారత్‌కు కేవలం ఈ మాత్రం పతకాలేనా అని పదే పదే వినిపించే అవమానకరమైన ప్రశ్నకు జవాబివ్వడం కోసం అయిదేళ్ళుగా ప్రభుత్వం, ఆటగాళ్ళు శ్రమిస్తున్నారు. కేంద్రం 1169 కోట్ల ఖర్చుతో 18 జాతీయ క్రీడా సమాఖ్యలకూ, 128 మంది ఒలింపిక్స్‌ ఆశావహులకూ అండగా నిలిచింది. ఖేలో ఇండియా క్రీడలకు తెరతీసింది. ఒలింపియన్ల కోసం టాప్ పథకం తీసుకొచ్చింది. ఈ చిరు ప్రయత్నాలాతో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన అథ్లెట్ల సంఖ్య మాత్రమే పెరిగింది.

35 కోట్ల మంది జనాభా ఉన్న యూఎస్‌ నుంచి 630 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ విలేజ్ లో అడుగుపెట్టారు. 160 కోట్ల మంది జనాభా ఉన్న చైనా నుంచి 406 మంది అథ్లెట్లు, చివరకు 12 కోట్ల మంది జనాభా ఉన్న జపాన్ నుంచి కూడా 552 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ లో అడుగుపెట్టారు. కానీ 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం నుంచి మాత్రం కేవలం 126 మందే ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యారు. దీనికే గతం కంటే ఎక్కువ మంది వెళ్తున్నారని సంబరపడాల్సిన దుస్థితి. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రోయింగ్ లాంటి విభాగాల్లో అయితే పతకం సంగతి దేవుడెరుగు.. అసలు క్వాలిఫై అవడమే పెద్ద ఫీట్ అనే పరిస్థితి ఉంది. ఒలింపిక్స్ కు కొన్ని నెలల ముందు జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకాల పంట పండించిన స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతానుదాస్.. ఒలింపిక్స్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. వ్యక్తిగత, టీమ్ విభాగాలు అన్నింటిలోనూ విఫలమయ్యారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా షూటింగ్ లో స్వర్ణం గెలవడంతో.. అదో పెద్ద అద్భుతం అయింది. అప్పట్నుంచి షూటింగ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ మన షూటర్లు మాత్రం ఒలింపిక్స్ లో వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ 30 పతకాలు గెలిస్తే అందులో ఒక్క క్రీడలోనే 11 పతకాలు వచ్చాయి. మొత్తం 9 స్వర్ణాల్లో ఎనిమిది ఈ ఆటలో దక్కినవే. ఆ ఆటే హాకీ. గతమెంతో ఘనం అన్నట్లు ఒలింపిక్స్‌ హాకీలో మన చరిత్ర చిరస్మరణీయం. ఈ ఆటలో ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో అత్యధిక విజయవంతమైన దేశం మనదే. ఇలా గతం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు. అదో హాకీ స్వర్ణ యుగం. అప్పటి జట్టు బరిలో దిగుతుంటే పతకం మనదే అన్న ధీమా ఉండేది. ఇప్పుడు పతకం సాధిస్తే గొప్ప అన్నట్టుగా మారిపోయింది. అయితే గత కొన్నేళ్లుగా మెరుగవుతున్న భారత హాకీ ఈసారి పతక ఆశలు పుట్టిస్తోంది. పురుషుల, మహిళల జట్లు రెండూ సెమీస్ లో అడుగుపెట్టడంతో.. మరో చరిత్రకు తెర లేవనుందా అనే ఆశలు మొలకెత్తుతున్నాయి.

భారత మహిళల హాకీ జట్టు చరిత్రలో తొలిసారిగా సెమీస్ గడప తొక్కింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో విజయం సాధించింది. మూడుసార్లు ఒలింపిక్స్ విజేత ఆస్ట్రేలియాను 1-0 తేడాతో మట్టికరిపించింది.

టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. సెమీ ఫైనల్ చేరిన లవ్లీనా ఇప్పుడు దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది. 23 ఏళ్ల లవ్లీనా మొదట కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. చివరికి ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరింది. అసోం నుంచి ఒలింపిక్స్‌కు క్వాలిపై అయిన తొలి మహిళగా, శివ థాపా తర్వాత రాష్ట్రం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో బాక్సర్‌గా నిలిచింది లవ్లీనా.

ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ భారత్ కు తొలిరోజే పతకం రాలేదు. ఈసారి మీరాబాయి చాను ఆ లోటు తీర్చింది. వెయిట్‌లిఫ్టింగ్‌ లో రెండు దశాబ్దాల పతక నిరీక్షణకు మీరాబాయి చాను తెరదించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించగా… 21 ఏళ్ల తర్వాత మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సష్టించింది.

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇంతవరకూ బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్ నుంచి పురుషులు కానీ మహిళలు కానీ ఆ ఘనత సాధించలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ లో.. చైనా అమ్మాయి బింగ్ జియావోపై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలిచిన సింధు.. 2016లో రియోలో రజత పతకం సాధించింది.