NTV Telugu Site icon

ఒలింపిక్స్‌ లో 47వ స్థానంలో భారత్‌…

టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాయి. ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 39 స్వర్ణాలతో అమెరికా టాప్‌ ప్లేసు సాధించింది. ఆ తర్వాతి స్థానాలను చైనా, జపాన్‌ పొందాయి. భారత్‌ మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది.

అసలు జరుగుతాయా, లేదా అన్న సందిగ్ధత నుంచి ఎన్నో అవాంతరాలను అధిగమించి టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన కరోనా.. ఒలింపిక్స్‌ను కూడా కమ్మేసింది. చివరికి ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాయి. ముగింపు వేడుకలను గతంలో మాదిరి అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు.

ఈ ఒలింపిక్స్‌లో మనదేశానికి మధురానుభూతిని మిగిల్చాయి. ఇంతవరకూ ఏ ఒలింపిక్స్‌లో సాధించనన్ని పతకాలను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సాధించిన ఆరు పతకాల రికార్డును అధిగమించింది.

ఇక ఈ ఒలింపిక్స్‌లో టాప్‌ ప్లేస్‌ కోసం అమెరికా, చైనా.. తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది.

ముగింపు వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్‌ వేదికగా జరగబోయే తదుపరి ఒలింపిక్స్‌కు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిశాయి.