NTV Telugu Site icon

IND vs WI: వెస్టిండీస్‌పై గ్రాండ్‌ విక్టరీ.. భారత్‌ ఖాతాలో మరో సిరీస్‌..

Team India

Team India

భారత్‌ చేతిలో వెస్టిండీస్‌ మరోసారి చిత్తైంది. మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన విండీస్‌… టీ-20 సిరీస్‌నూ 1-4 తేడాతో భారత్‌కు సమర్పించుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ-20 మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది… భారత్‌. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది. టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఐదో ఓవర్లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఇషాన్‌ కిషన్‌ ఔటైనా… శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా ఏ మాత్రం తగ్గకుండా విండీస్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. అయ్యర్‌ 40 బంతుల్లోనే 64 రన్స్‌ చేస్తే… దీపక్‌ హుడా 25 బాల్స్‌లోనే 38 రన్స్‌ చేశాడు. ఇక చివర్లో హార్దిక్‌ పాండ్యా 16 బంతుల్లోనే 28 రన్స్‌ బాదడంతో… 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి… 188 రన్స్‌ చేసింది.

Read Also: Commonwealth Games 2022: అదరగొట్టిన భారత్‌.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు..

ఇక, భారత్‌ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోడానికి బ్యాటింగ్‌ మొదలెట్టిన విండీస్‌… క్రమంగా వికెట్లు పడిపోవడంతో… ఏ దశలోనూ ధాటిగా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. స్కోర్‌బోర్డ్‌పై ఒక్క పరుగు కూడా చేరకుండానే… తొలి ఓవర్లో తొలి వికెట్‌ కోల్పోయింది… విండీస్‌. ఐదో ఓవర్లో మరో రెండు వికెట్లు పడ్డాయి. 8వ ఓవర్లో ఒక వికెట్‌… 12వ ఓవర్లో రెండు వికెట్లు… 13వ ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. ఇక 16వ ఓవర్లో చివరి రెండు వికెట్లు పడటంతో… సరిగ్గా వంద పరుగులకు ఆలౌటైంది… వెస్టిండీస్‌. మొత్తం నలుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌటయ్యారు. హెట్‌మెయిర్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి హాఫ్‌ సెంచరీ బాదినా… అతనికి అండగా ఎవరూ నిలబడకపోవడంతో… విండీస్‌ ఓటమి ఖాయమైంది. 15.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2.4 ఓవర్లో వేసి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అక్షర్‌ పటేల్‌ ఎంపికవగా… మ్యాన్‌ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డ్‌ అర్హ్‌దీప్‌ సింగ్‌ దక్కించుకున్నాడు. భారత కుర్రాళ్లు. అన్ని ఫార్మాట్లలో కలిపి విండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 13వ సిరీస్‌ విజయం.