NTV Telugu Site icon

Common Wealth Games 2022: ఐదో రోజు అదరగొట్టిన భారత్.. ఖాతాలో 2 స్వర్ణాలు, 2 రజతాలు

Common Wealth Games

Common Wealth Games

Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో మంగళవారం భారత్‌ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్‌వెల్త్‌ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్‌బౌల్స్‌ ఫోర్స్‌ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు. మరోవైపు టేబుల్‌ టెన్నిస్‌లో పురుషుల జట్టు టైటిల్‌ నిలబెట్టుకుంది. రజతంతో వికాస్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి మరో పతకం తెచ్చిపెట్టాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు భారత్ 13 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇందులో 5 స్వర్ణాలు, 5రజతాలు, 3 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి.

లాన్‌బౌల్స్‌లో చరిత్ర: లాన్‌ బౌల్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. లవ్లీ, పింకీ, రూప, నయన్‌మోని సభ్యులుగా ఉన్న ‘ఫోర్స్‌’ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. అమ్మాయిల లాన్‌బౌల్స్‌ జట్టు కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో ఈ ఆటలో దేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 17–10 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. మధ్యలో వెనకబడ్డప్పటికీ అద్భుతంగా పుంజుకున్న జట్టు అసాధారణ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌లో ఏడు ఎండ్‌లు ముగిసే సరికి భారత మహిళలు 8-2తో పైచేయి సాధించారు. కానీ ఆ తర్వాత భారత గురి కాస్త తప్పింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న దక్షిణాఫ్రికా 10-8తో భారత్‌ను దాటింది. కానీ ఈ క్రీడల్లో పోరాటాన్నే నమ్ముకుని అద్భుతంగా సాగిన భారత్‌.. ఫైనల్లోనూ కఠిన పరిస్థితుల్లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఎండ్‌–14 తర్వాత భారత్‌ 15–10తో ముందంజలో ఉండగా… చివరి ఎండ్‌లో 6 పాయింట్లు సాధిస్తే స్వర్ణం గెలిచే స్థితిలో దక్షిణాఫ్రికా నిలిచింది. అయితే ఇందులోనూ భారత్‌ 2 పాయింట్లు సాధించగా, సఫారీ మహిళలు ఒక్క పాయింట్‌ను కూడా గెలవలేక చేతులెత్తేశారు. చివరి ప్రయత్నంలో విసిరిన బౌల్‌.. జాక్‌కు చాలా దూరంగా వెళ్లడంతో భారత్‌ స్వర్ణ సంబరాల్లో మునిగిపోయింది.

టీటీలో భారత్ హవా: టేబుల్‌ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ హవా కొనసాగింది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో వరుసగా అంచనాలను నిలబెట్టుకుని రెండో సారి కామన్వెల్త్‌ క్రీడల పసిడి పట్టేసింది. ఫైనల్లో భారత్‌ 3–1 తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. మొదట డబుల్స్‌లో హర్మీత్‌- సత్యన్‌ జంట 13-11, 11-7, 11-5తో యాంగ్‌ క్విక్‌–కూన్‌ పాంగ్‌పై గెలిచి జట్టుకు శుభారంభాన్ని అందించింది. కానీ ఆ తర్వాత తొలి సింగిల్స్‌లో వెటరన్‌ ఆటగాడు శరత్‌ కమల్‌కు చుక్కెదురైంది. అతను 7-11, 14-12, 3-11, 9-11తో జీ యూ చేతిలో ఓడాడు. దీంతో పోరు 1-1తో సమమైంది. కానీ రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో సత్యన్‌ 12-10, 7-11, 11-7, 11-4తో కూన్‌ పాంగ్‌పై గెలిచి జట్టుకు అత్యవసరమైన విజయాన్ని అందించాడు. దీంతో భారత్‌ 2-1తో ఆధిక్యం సాధించింది. ఇక మరో కీలక సింగిల్స్‌లో హర్మీత్‌ దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. అతను 11-8, 11-5, 11-6తో జీ యూపై గెలవడంతో జట్టు విజయ సంబరాల్లో మునిగిపోయింది. ఇంగ్లాండ్ రజతాన్ని సొంతం చేసుకుంది.

CWG 2022: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం.. రజతం గెలుచుకున్న వికాస్‌ ఠాకూర్‌

మెరిసిన వికాస్ ఠాకూర్: వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో పతకం భారత్‌ ఖాతాలో చేరింది. భారత సీనియర్‌ వెయిట్‌లిఫ్టర్‌ వికాస్‌ ఠాకూర్‌ వరుసగా మూడో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ పతకంతో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో వికాస్‌ ఠాకూర్‌ రజతంతో మెరిశాడు. పంజాబ్‌కు చెందిన వికాస్‌ మొత్తం 346 కేజీలు (స్నాచ్‌లో 155+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 191) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ చివరి ప్రయత్నంలో 198 కేజీలు ఎత్తే ప్రయత్నంలో వికాస్‌ విఫలమయ్యాడు. సమోవా లిఫ్టర్‌ డాన్‌ ఒపెలోగ్‌ (381 కేజీలు) స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం గెలవడం వికాస్‌కు ఇది మూడోసారి. 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో రజతం నెగ్గిన వికాస్‌… 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 94 కేజీల విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.

బ్యాడ్మింటన్‌లో రజతం: గత కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. మలేసియాతో ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ 1-3తో ఓటమి పాలైంది. మొదట పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 18-21, 15-21తో ఫాంగ్‌- వూయి చేతిలో ఓడిపోయింది. ఈ స్థితిలో సింధు మహిళల సింగిల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె 22-20, 21-17తో జిన్‌ వీపై గెలిచి జట్టును రేసులో నిలిపింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 19-21, 21-6, 16-21తో జి యాంగ్‌ చేతిలో ఓటమి పాలవడంతో భారత్‌ మళ్లీ 1-2తో వెనుకబడింది. కీలక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్‌-ట్రెసా జాలీ జోడీ 18-21, 17-21తో తిన్నయ-పియర్లీ జంట చేతిలో ఓటమి పాలవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.

CWG 2022: లాన్‌బౌల్స్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన మహిళల జట్టు గురించి తెలుసా?