Asian Games 2026: షూటింగ్‌లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్

  • ఏషియన్ గేమ్స్‌లో భారత్ జోరు
  • షూటింగ్‌లో మరో సిల్వర్
  • పాక్‌పై టేబుల్ టెన్నిస్‌లో ఘన విజయం
Asian Games 2026

Asian Games 2026

Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు రెండో రోజు కూడా పతకాల పంట కొనసాగుతోంది. సెప్టెంబర్ 21న షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత పతకం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మూడు రజత పతకాలు చేరాయి. షూటింగ్‌లో హిమాంశు ధిల్లాన్, పార్త్ మానే, రుద్రాంశ్ పాటిల్తో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో భారత్ మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకుంది.

టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌పై భారత్ 3-0 విజయం

మహిళల టేబుల్ టెన్నిస్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన గ్రూప్ ఎఫ్ మ్యాచ్‌లో భారత జట్టు 3-0తో విజయం సాధించింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున సుతీర్థా ముఖర్జీ, సిండ్రెలా దాస్, శ్రీజా అకులా తమ తమ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించారు. శ్రీజా అకులా తన సింగిల్స్ మ్యాచ్‌లో ఫాతిమా ఖాన్‌ను 11-4, 11-4, 11-5 తేడాతో ఓడించి భారత్‌కు 3-0 విజయాన్ని ఖరారు చేశారు.

భారత్‌కు పతకాలపై భారీ ఆశలు

ఏషియన్ గేమ్స్ రెండో రోజు భారత్ పలు క్రీడాంశాల్లో బరిలోకి దిగింది. షూటింగ్‌తో పాటు టేబుల్ టెన్నిస్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్ తదితర ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడుతున్నారు. MMAలో సుచికా తారియాల్ సెమీఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన టియో హుయ్ హూన్‌తో తలపడాల్సి ఉంది. సెమీఫైనల్‌కు చేరుకోవడంతో సుచికా ఇప్పటికే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. ఫైనల్‌కు చేరితే స్వర్ణ పతకం కోసం పోటీపడే అవకాశం ఉంటుంది. మహిళల హాకీలో భారత్ ఇండోనేషియాతో, పురుషుల కబడ్డీలో జపాన్‌తో, మహిళల కబడ్డీలో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో పోటీ పడుతోంది. బాక్సింగ్‌లో సుమిత్ 70 కేజీ విభాగంలో బుంజోంగ్ సింసిరితో పోటీపడుతున్నారు.

తొలి రోజే రెండు రజత పతకాలు

ఏషియన్ గేమ్స్ 2026 తొలి రోజు భారత్‌కు షూటింగ్‌లో రెండు రజత పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్ రజతం సాధించగా, టీమ్ ఈవెంట్‌లో ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదర్సా వినోద్‌లతో కూడిన భారత జట్టు మరో రజత పతకం సాధించింది. ఇప్పుడు పురుషుల షూటింగ్ టీమ్ సాధించిన మరో రజతంతో భారత్ పతకాల సంఖ్య మూడు రజతాలకు చేరింది. ఏషియన్ గేమ్స్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధించేందుకు రెండో రోజు పోటీలు కొనసాగుతున్నాయి.