Reasons for India Loss against West Indies: వెస్టిండీస్‌తో రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ అజేయ శతకం (102), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (84) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కరీబియన్ జట్టు 18.3 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే ఇంత భారీ స్కోరు చేసినా భారత్ ఎందుకు ఓడిపోయిందనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది.అందుకు ఐదు కారణాలు ఉన్నాయి.అవేంటో చూద్దాం.
భారీ మంచు ప్రభావం:
భారత ఓటమికి ప్రధాన కారణాల్లో మంచు ప్రభావం ఒకటి. రెండో ఇన్నింగ్స్‌లో మైదానంపై మంచు ఎక్కువగా పడటంతో బంతి తడిగా మారింది. దీంతో భారత బౌలర్లు బంతిపై పట్టు సాధించడంలో, అనుకున్న విధంగా బంతులను వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యమైన బంతులు వేయడం కష్టమైంది. ఈ పరిస్థితులను వెస్టిండీస్ బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
బౌలర్లకు సహకరించని పిచ్:
రాంచీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. బౌలర్లకు తిప్పలు తప్పలేదు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ భారత బౌలర్లు కీలక సమయాల్లో పరుగులను నియంత్రించలేకపోయారు. 249 పరుగులు చేసినప్పటికీ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. ప్రతి బౌలర్ భారీగా రన్స్ ఇచ్చారు. ప్రధాన స్పిన్నట్లు అక్షర్ పటేల్ 3.3 ఓవర్లలోనే 63 రన్స్ సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. పేసర్లు మయాంక్, అర్ష్‌దీప్ కూడా పరుగులు కట్టడి చేయలేదు.
హోప్, రూథర్‌ఫర్డ్ భాగస్వామ్యం:
వెస్టిండీస్ విజయంలో కెప్టెన్ షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ కీలక పాత్ర పోషించారు. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. హోప్ 45 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేయగా.. రూథర్‌ఫర్డ్ 37 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 54 బంతుల్లోనే 120 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తిగా వెస్టిండీస్ వైపు తిప్పారు. ఈ ఇద్దరిలో ఒక్కరు ముందుగా అవుట్ అయినా ఫలితం మరోలా ఉండేది.
భారత స్పిన్నర్లపై దాడి:
మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా రూథర్‌ఫర్డ్ స్పిన్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. మంచు కారణంగా బంతిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. కీలక ఓవర్లలో పరుగుల వేగాన్ని తగ్గించడంలో విఫలమవడంతో.. వెస్టిండీస్ లక్ష్యానికి చేరువైంది. అక్షర్, కుల్దీప్, నమన్ పూర్తిగా తేలిపోయారు.
చివరి ఓవర్లలో షెఫర్డ్ మెరుపులు:
హోప్, రూథర్‌ఫర్డ్ భాగస్వామ్యంతో విజయానికి పునాది పడగా.. రొమారియో షెఫర్డ్ చివర్లో మ్యాచ్‌ను ముగించాడు. కేవలం 13 బంతుల్లో అజేయంగా 34 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా 17వ, 18వ ఓవర్లలో వెస్టిండీస్ భారీగా పరుగులు రాబట్టడంతో చివరి వరకు ఉత్కంఠకు తావులేకుండా విజయం సాధించింది. పిచ్ పరిస్థితులు వెస్టిండీస్‌కు అనుకూలించినప్పటికీ.. బౌలింగ్ వ్యూహాలు, లైన్ అండ్ లెంగ్త్‌లో మరింత కచ్చితత్వం మిస్ అవ్వడంతో భారత్ మూల్యం చెల్లించుకుంది.

