Site icon NTV Telugu

IND vs SL: నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20.. అభిమానులకు ప్రత్యేక సందర్భం!

Ind Vs Sl 3rd Women’s T20

Ind Vs Sl 3rd Women’s T20

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 నుంచి మూడో టీ20 ఆరంభం కానుంది. వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన భారత్.. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాలే అని చెప్పాలి. విశాఖలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన లంక.. మూడో మ్యాచ్‌లో ఏ మేరకు పోటీని ఇస్తుందో చూడాలి.

తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సత్తా చాటారు. స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మలతో పాటు పేసర్‌ క్రాంతి గౌడ్‌ రాణిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు లంక బ్యాటర్లను పరుగులు చేయనీయలేదు. తొలి టీ20లో 121 పరుగులకే పరిమితమైన లంక.. రెండో టీ20లో 128 పరుగులే చేసింది. దాంతో మూడో మ్యాచ్‌లోనూ భారత బౌలర్ల నుంచి మరోసారి మంచి ప్రదర్శనను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. జెమీమా, షెఫాలి వర్మ అర్ధ సెంచరీలతో జోరుమీదున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మంధాన భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. జ్వరం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ.. మూడో మ్యాచ్‌ ఆడనుంది. మొత్తంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో టీమిండియాకు తిరుగులేదు.

రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. తొలి మ్యాచ్‌లో 121/6, రెండో మ్యాచ్‌లో 128/9 మాత్రమే చేయగలిగింది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే లంక బ్యాటర్లు సత్తాచాటాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ చమరి బాధ్యతగా ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో విష్మి గుణరత్నే 39 పరుగులు, రెండో మ్యాచ్‌లో హర్షిత సమరవిక్రమ 33 పరుగులు చేశారు కానీ.. ఆ ఇన్నింగ్స్‌లు జట్టుకు సరిపోలేదు. తిరువనంతపురం అభిమానులకు ఇది ప్రత్యేక సందర్భం అనే చెప్పాలి. తొలిసారిగా మహిళల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు తిరువనంతపురం ఆతిథ్యం ఇస్తోంది. అందుకే స్థానిక ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు.

జట్లు:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ కమలిని (వికెట్ కీపర్), ఎన్. శ్రీచరణి, వైష్ణవి శర్మ.
శ్రీలంక: చమరి అథపత్తు (కెప్టెన్), హసిని పెరేరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, నిలక్షిక డి సిల్వా, కవిషా దిల్హారి, ఇమేషా దులానీ, కౌషిణి నుత్యాంగన, మల్షా షేహని, ఇనోకా రణవీర, శశిని గిమ్హాని, నిమేషా మదుషానీ, కావ్య కవింది, రష్మిక సేవ్వండి, మల్కీ మదారా.

Exit mobile version