India Playing XI Hint Revealed: శ్రీలంకతో శనివారం (ఆగష్టు 15) నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక హింట్ ఇచ్చాడు. తొలి టెస్టులో టీమిండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని చెప్పకనే చెప్పాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లను ఒకే మ్యాచ్‌లో ఆడించడం తమకు పెద్ద సమస్యగా అనిపించడం లేదని మోర్కెల్ స్పష్టం చేశాడు.
గాలే పిచ్ మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు మరింత అనుకూలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌ను ఎంచుకుంటే.. శ్రీలంక బ్యాటర్లపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. ‘కుల్దీప్ యాదవ్ అటాకింగ్ బౌలర్. అతడి అనుభవం, నైపుణ్యాన్ని విస్మరించలేము. రవీంద్ర జడేజా కచ్చితమైన లైన్, లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. మానవ్ సుతార్ బంతిని ఎక్కువగా తిప్పగల ఎడమచేతి స్పిన్నర్. వీళ్ల ముగ్గురిలో ఒక్కొక్కరి బౌలింగ్ శైలి ఒక్కోలా ఉంటుంది. ముగ్గురు ఎడమచేతి స్పిన్నర్లను ఆడించడం మాకు పెద్ద సమస్యగా అనిపించడం లేదు’ అని వివరించాడు.
అయితే ఈ ముగ్గురిని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఏ సమయంలో, ఎలా ఉపయోగిస్తాడనేదే కీలకమని మోర్కెల్ తెలిపాడు. ‘మూడు విభిన్న స్పిన్ ఆప్షన్లు ఉండటంతో టీమిండియా 20 వికెట్లు పడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుల్దీప్, జడేజా, మానవ్ తమదైన రోజున వికెట్ల వేట కొనసాగిస్తారు. గాలే మైదానంలో టెస్టు మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు పిచ్ నుంచి ఎక్కువ సహకారం దక్కుతుంది. మ్యాచ్ తొలి రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. ఆపై బంతి టర్న్ అవుతూ బ్యాటర్లకు సవాల్ విసురుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లడం సరైన వ్యూహంగా అనిపిస్తోంది’ అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
జస్ప్రీత్ బుమ్రా గైహాజరీలో మహ్మద్ సిరాజ్ పేస్ విభాగంను ముందుండి నడిపించనున్నాడు. అతడితో కలిసి కొత్త బంతిని పంచుకునే రెండో పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంది. ‘ప్రసిద్ధ్, గుర్నూర్‌లకు టెస్టు అనుభవం పెద్దగా లేకపోయినా.. స్వదేశంలో కఠిన పరిస్థితుల్లో ఆడారు. శ్రీలంకలో ప్రధాన సవాలు వేడి, అధిక తేమ. కూకాబుర్రా బంతి 20 నుంచి 35 ఓవర్ల తర్వాత మెత్తబడే సమయంలో పేసర్లు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. క్రీస్‌ను ఎలా ఉపయోగించాలి, షార్ట్ బాల్‌ను ఎప్పుడు ప్రయోగించాలి వంటి విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసిద్ధ్ అయినా, గుర్నూర్ అయినా.. ఎవరికి తుది అవకాశం లభించినా వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలరు’ అని మోర్కెల్ చెప్పాడు. గాలేలో భారత జట్టు కుల్దీప్, జడేజా, మానవ్ సుతార్‌లతో ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగనునట్లు మోర్కెల్ చెప్పాడు.
మొదటి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగనుందని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టం చేశాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడనున్నారు. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడనున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో, ఐదులో రిషభ్ పంత్ ఆడుతాడు. ఆరులో సర్ఫరాజ్ ఖాన్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బౌలింగ్‌లో జడేజా రవీంద్ర, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్ బెంచ్‌లో ఉండనున్నారు. నబీ, సారాంశ్ అరంగేట్రం ఆలస్యం కానుంది.

