NTV Telugu Site icon

IND vs SA: సఫారీలతో తొలి T20లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..

Ac7b2f5697

Ac7b2f5697

సుమారు రెండున్నర నెలలపాటు అలరించిన IPL 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అప్‌కమింగ్ భారత్-సౌతాఫ్రికా T20 సిరీస్‌పై నెలకొంది. సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకున్న వేళ ఐపీఎల్‌లో మెరిసిన స్టార్లతో టీమిండియా సొంతగడ్డపై సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న T20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను టీమిండియా సన్నాహకంగా భావిస్తోంది. IPL లో మెరిసిన స్టార్ల సత్తాను పరీక్షించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ విశ్రాంతి నేపథ్యంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు లేని వేళ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందా? అనేదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.

ఇక ఓపెనర్లుగా కెప్టెన్ KL రాహుల్‌, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ సెకండాఫ్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడటం ఖాయం. ఐపీఎల్‌లో అయ్యర్ ఆశించిన రీతిలో రాణించకపోయినా.. అతనికి పోటీ లేదు. అయ్యర్‌ను కాదని దీపక్ హుడా ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న రిషభ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన పంత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో రాణిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా T20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికవుతాడు.

IPL2022 సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీలో అదరగొట్టి టైటిల్ అందించిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. T20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్.. మళ్లీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఆర్‌సీబీ తరఫున ఫినిషర్‌గా దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. T20 ప్రపంచకప్ ఆడాలంటే అతను ఈ సిరీస్‌లో రాణించడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటికే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ జట్టులో ఉన్న నేపథ్యంలో కార్తీక్‌ను ఆడిస్తారా? అనేది సందేహం. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే అతన్ని పక్కనపెట్టే అవకాశం లేదు.

IPL 2022 సీజన్‌లో తనదైన వేగంతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌కు అనుకూలంగా ఉంటే ఆసీస్ పిచ్‌లపై ఉమ్రాన్ జట్టుకు వెపన్‌లా మారనున్నాడు. ఈ క్రమంలోనే అతనికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వనున్నారు. భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. భువీకి తోడుగా హర్షల్ పటేల్ ఆడనున్నాడు.

తుది జట్టు(అంచనా):

KL రాహుల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్/అర్షదీప్ సింగ్