Site icon NTV Telugu

IND Vs ENG: నేటి నుంచి ఐదో టెస్ట్.. టెస్టుల్లో తొలిసారిగా ఆటగాళ్ల నెత్తిపై కెమెరా

Fifth Test Match Min

Fifth Test Match Min

బర్మింగ్ హామ్ వేదికగా నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌ను ఐసీసీ తాజాగా నిర్వహిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, డ్రా అయినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. రోహిత్ శర్మకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ మ్యాచ్‌కు సారథిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ సహకారం అందించనున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. సోనీ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్, సోనీ లివ్ ఛానళ్లలో లైవ్ మ్యాచ్ వస్తుంది. ఈ మ్యాచ్ జరిగే ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో భారత్ రికార్డు పేలవంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ మైదానంలో భారత్ ఏడు టెస్టులు ఆడగా.. ఆరు మ్యాచుల్లో ఓడింది. ఒకటి డ్రా అయింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈ మైదానంలో మ్యాచ్ భారత్‌కు పెనుసవాల్‌గా మారనుంది.

Read Also: Plastic Ban: నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్.. లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష

మరోవైపు ఈ మ్యాచ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. టెస్టుల్లో తొలిసారిగా ఆటగాళ్ల నెత్తిపై కెమెరా కనిపించనుంది. ఈ మ్యాచ్‌ను టీవీ ప్రేక్షకులు మరింత దగ్గర్నుంచి చూసేందుకు షాట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసే ఆటగాడి హెల్మెట్‌కు కెమెరాను ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్కై స్పోర్ట్స్ అమర్చనుంది. దీని కోసం స్కై స్పోర్ట్స్.. ఐసీసీతో పాటు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అనుమతి కూడా తీసుకుంది. ఇంగ్లండ్ తరఫున షార్ట్‌ లెగ్‌‌ ఫీల్డర్ ఒలీ పోప్‌ కెమెరా ఉన్న హెల్మెట్‌ పెట్టుకొని ఫీల్డింగ్ చేయనున్నాడు. దీని ద్వారా బ్యాటర్‌కు అతి సమీపం నుంచి దృశ్యాలను రికార్డు చేసి ప్రేక్షకులకు టీవీలో చూపించనున్నారు. ఇది టీవీలో మ్యాచ్ చూసే వారికి కొత్త అనుభూతిని కలిగించనుంది. ఈ కెమెరా స్టేడియంలోని ప్రేక్షకుల అరుపులను రికార్డు చేయదు. కేవలం తన ముందు ఉన్న బ్యాటర్ కదలికలు, అతడి ఆటను మాత్రమే దగ్గరగా రికార్డు చేస్తుంది.

Exit mobile version