Sitanshu Kotak on Vaibhav Sooryavanshi India Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎంపికైన తొలి రోజు నుంచే వైభవ్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని, అతడిని ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగే మూడో టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన కోటక్.. వైభవ్ తన సహజమైన ఆటనే కొనసాగించాలని జట్టు యాజమాన్యం సూచించిందని సితాంశు తెలిపాడు.
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 15 సంవత్సరాల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్‌లోనే 10 బంతుల్లో రెండు భారీ సిక్సర్లతో 14 పరుగులు చేసి తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వైభవ్ గురించి సితాంశు కోటక్ మాట్లాడుతూ.. ‘వైభవ్ భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచే అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి మ్యాచ్‌కు ముందు మాత్రమే సిద్ధం చేశామని చెప్పడం సరైంది కాదు. అతడి ఆట, సహజమైన శైలి, దూకుడే అతడి బలం. అదే ఆటను కొనసాగించాలని మాత్రమే మేము చెప్పాం. ఇలా ఆడు, అలా ఆడు అని ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు’ అని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత భారత జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని కోటక్ పేర్కొన్నాడు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టడం, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టులో లేకపోవడం, పలువురు యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం వల్ల విజయాలకు కొంత సమయం పడుతుందని వివరించాడు. ‘గత రెండేళ్లలో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా కోల్పోలేదు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ గెలిచాం. ఇప్పుడు వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయినంత మాత్రాన జట్టుపై విమర్శలు రావడం సహజమే. ఇది ఆటలో భాగం. మార్పుల దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు రావచ్చు. అయినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో మెరుగుపడటమే మా లక్ష్యం. మరో రెండేళ్లలో జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేస్తున్నాం’ అని కోటక్ చెప్పాడు.
టీ20 క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్ పాత్ర ఎంతో కీలకమని కోటక్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్య లాంటి ఆటగాడి లోటును భర్తీ చేయడానికి యువ ఆల్‌రౌండర్లకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపాడు. ‘టీ20ల్లో ఆరో బౌలర్‌గా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ప్రస్తుతం నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో దూరమయ్యాడు. అతడికి అనుభవం వచ్చేలా అవకాశాలు ఇస్తున్నాం. అలాగే సూర్యాంశ్ షెడ్జే ఇటీవలే జట్టులో చేరాడు. తుది జట్టులో అందరికీ అవకాశం రాకపోయినా.. భారత జట్టు వాతావరణానికి అలవాటు పడటం కూడా ఎంతో ముఖ్యం. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ద్వారా వారు మరింత రాటుదేలుతారు. రెండేళ్ల తర్వాత జరిగే పెద్ద టోర్నీల కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కలిసి భవిష్యత్ జట్టును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి’ అని కోటక్ వివరించాడు.
ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఇప్పటివరకు విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మూడో టీ20లో గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ భారత జట్టు పట్టుదలగా ఉంది. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తూ.. భవిష్యత్ టీ20 ప్రపంచకప్‌కు బలమైన జట్టును నిర్మించడమే టీమ్ మేనేజ్‌మెంట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

