Site icon NTV Telugu

IND Vs BAN: వన్డే సిరీస్ పోయింది.. టెస్ట్ సిరీస్ అయినా పట్టేస్తారా?

Team India

Team India

IND Vs BAN: నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చిట్టగ్యాంగ్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా టెస్టు సిరీస్‌లో గెలవాలని భావిస్తోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ పూర్తిగా గాయాల నుంచి కోలుకోకపోవటంతో వారి స్థానంలో సౌరభ్ కుమార్, నవదీప్ సైనీ జట్టులోకి వచ్చారు.

Read Also: Gas Crisis: గృహవినియోగదారులకు షాక్.. రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా

రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తర్వాతి స్థానాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ రాహుల్‌ తాను మిడిలార్డర్‌లో ఆడాలని భావిస్తే అభిమన్యు ఈశ్వరన్‌కు తుది జట్టులో ఛాన్స్ లభించనుంది. కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌కు వెళ్తే అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ రిజర్వు బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది. అందువల్ల ఈ సాహసాన్ని రాహుల్ చేయకపోవచ్చు. అటు వికెట్ కీపర్‌గా పంత్ లేదా కేఎస్ భరత్ తుది జట్టులో ఉంటారు. ఇద్దరు స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఆడనున్నారు. పేసర్లుగా మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఆడటం ఖాయం కాగా.. మూడో పేసర్‌గా జయదేవ్ ఉనద్కట్, శార్దూల్ ఠాకూర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Exit mobile version