NTV Telugu Site icon

Team India: అక్కడ టాప్‌గా నిలిస్తే.. కప్పు మాత్రం రాదు.. ఇది పక్కా..!!

Team India Icc Tourney

Team India Icc Tourney

Team India: 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లకుండానే వెనుతిరిగిన టీమిండియా ఈ ఏడాది మాత్రం సెమీస్‌కు వెళ్లి ఆశలు రేకెత్తించింది. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోరంగా ఓటమి చెంది టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం టీమిండియాను దెబ్బతీసిందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రపంచకప్ ఫైనల్ లేదా సెమీఫైనల్లో టీమిండియా వెనుదిరిగిన ప్రతీసారి భారత ఆటగాళ్లే టాప్ స్కోరర్‌గా ఉన్నారని.. ఈ అంశం భారత జట్టుకు శాపంగా మారిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి పలు ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు. 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోయింది.

అటు 2003 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. అప్పటికి సచిన్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు భంగపాటు తప్పలేదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం గంభీర్ సెకండ్ లీడింగ్‌లో ఉన్నాడు. దీంతో భారత్ ఖాతాలో కప్పు చేరింది. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ సచిన్ సెకండ్ లీడింగ్ బ్యాటర్‌గా నిలవడంతో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 2014, 2016, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడని, ఈ మూడు టోర్నీల్లో భారత్ టైటిల్ అందుకోలేకపోయిందని అభిమానులు గుర్తుచేస్తున్నారు.

Read Also: ICC T20 Rankings: కప్పు పోయింది.. ర్యాంకు మిగిలింది

2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన భారత్.. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడింది. 2022 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సైతం రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఇక ప్రపంచకప్‌లలోనే కాదు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాది ఇదే దారి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.