Bangladesh vs ICC: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో ఐసీసీతో వివాదాన్ని పెట్టుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు గట్టి షాక్ తగిలింది. బీసీబీ విజ్ఞప్తిని ఇప్పటికే తిరస్కరించిన ఐసీసీ ఆ దేశానికి మరోసారి దిమ్మతిరిగేలా చేసింది. భారత్‌లోనే తమ మ్యాచ్‌లను నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీసీబీ దాఖలు చేసిన అప్పీల్‌ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్‌సీ) తిరస్కరించింది. తమ పరిధిలోకి రాని అంశంపై దర్యాప్తు చేయలేమని డీఆర్‌సీ కమిటీ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమావళి, డీఆర్‌సీ నిబంధనల ప్రకారం ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్‌ను విచారణ చేసే అధికారం కమిటీకి లేదని వెల్లడించారు.
Read Also: Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..
అయితే, అంతకుముందు జరిగిన ఓటింగ్‌లో ఐసీసీ బోర్డు సభ్యులు 14-2 మెజారిటీతో భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు నిర్వహించాలని తీర్మానం చేశాయి. డీఆర్‌సీ నిర్ణయం నేపథ్యంలో చివరి అస్త్రంగా స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆశ్రయించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూస్తుంది. ఎంతకీ, బీసీబీ తీరు మారకపోవడంతో, టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కి సమయం దగ్గరపడడంతో బంగ్లా జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడించాలని ఐసీసీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ (జనవరి 24న) అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.