Hardik Pandya vs Pakistan Stats: భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. అలాంటి హై వోల్టేజ్ పోరుల్లో ప్లేయర్స్ అద్భుత ప్రదర్శన చేయడం చాలా కష్టం. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ.. బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. హై వోల్టేజ్ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎన్నోసార్లు కళ్లు చెదిరే ప్రదర్శనలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపుతూ.. పాకిస్థాన్‌పై తన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకుని కీలక సమయంలో మెరిసిన సందర్భాలు హార్దిక్ ఎంత కీలక ఆటగాడో చెబుతున్నాయి.
ఛాంపియన్ ట్రోఫీ 2017 ఫైనల్లో హార్దిక్ పాండ్యా 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌ను ఇప్పటికీ అభిమానులు మర్చిపోయారు. అదే టోర్నీలో మరో మ్యాచ్‌లో 6 బంతుల్లో 20 రన్స్ చేయడమే కాకుండా.. బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ చాటాడు. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. 2022లో 40 పరుగులు చేయడమే కాకుండా.. 3/13 గణాంకాలతో మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించాడు. 2016లో 3/8 స్పెల్ కూడా అతని బెస్ట్ ప్రదర్శనల్లో ఒకటి.
ఆసియా కప్ మ్యాచ్‌ల్లో కూడా హార్దిక్ పాండ్యా ప్రభావం ఉంది. 2023లో 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో మ్యాచ్‌లో 1/17 గణాంకాలు నమోదు చేశాడు. 2022లో 17 బంతుల్లో 33 రన్స్ చేసి.. బౌలింగ్‌లో 3/25 గణాంకాలతో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. హార్దిక్ ఆల్‌రౌండ్ సామర్థ్యం బిగ్ మ్యాచ్‌ల్లో ఎంత కీలకమో ఇవే ఉదాహరణలు. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ సత్తా చాటాడు. 2019 వరల్డ్‌కప్‌లో 26(19) పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. 2023లో 2/34 స్పెల్‌తో బౌలింగ్‌లో తన సత్తా చూపించాడు. ఇటీవల మ్యాచ్‌ల్లో కూడా తక్కువ పరుగులు చేసినా కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు.
Also Read: 100 Years Gold Price History: రూ.18 నుంచి లక్ష 57 వేలు.. బంగారం 100 ఏళ్ల చరిత్ర ఇదే!
మొత్తానికి పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా గణాంకాలు చూస్తే.. అతడు కేవలం ఆల్‌రౌండర్ మాత్రమే కాదు, బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని స్పష్టమవుతుంది. ఒత్తిడి మ్యాచ్‌ల్లో మెరుస్తూ రాణిస్తూ భారత జట్టుకు విజయాలు అందించడం అతని ప్రత్యేకత. నేడు కొలంబోలో భారత్–పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో హార్దిక్ ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి. భవిష్యత్తులో భారత్–పాకిస్థాన్ పోరుల్లో అతడు ఇంకా ఎన్నో గుర్తుండిపోయే ప్రదర్శనలు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.