టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు దొరకడమే ప్రశ్నార్థకంగా మారింది. ఓపెనర్ల లిస్టులో రోహిత్, కేఎల్ రాహుల్, ధావన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులు అందుబాటులో ఉండటంతో మయాంక్‌కు చోటు దక్కడం కష్టతరంగా ఉంది. అయితే టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరంగా ఉండటంతో శ్రీలంకతో తొలి టెస్టుకు మయాంక్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అతడు కేవలం 33 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.
మయాంక్ ఇలానే ఆడితే టెస్టు టీంలో అతడిని కొనసాగించడం కష్టమని గంభీర్ జోస్యం చెప్పాడు. ఏదో ఆడాం అన్నట్లుగా ప్రదర్శన చేస్తే జట్టులో అతడి స్థానం సెక్యూర్‌గా ఉండదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. లసిత్ ఎంబుల్డేనియా, లహిరు కుమార సహా శ్రీలంక బౌలర్లు మయాంక్‌ను ఇబ్బందిపెట్టారని… ప్రత్యేకించి ఇన్నింగ్స్ ఆరంభంలో మయాంక్ చాలా అసౌకర్యంగా కనిపించాడని గంభీర్ అన్నాడు. కేఎల్ రాహుల్ తిరిగొస్తే మయాంక్ స్థానానికి గ్యారంటీ ఉండదనే అనుకుంటున్నానని చెప్పాడు. మయాంక్ చేయాల్సింది వీలైనంత వరకూ భారీ స్కోరు నమోదు చేయడమే అంటూ గంభీర్ మ్యాచ్ మధ్యలో ఓ టీవీ షోలో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించాడు.
