భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం (జనవరి 18) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత్ పర్యటనకు 8 మంది కొత్త ఆటగాళ్లు వచ్చినా.. అద్భుతంగా ఆడిన కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఓటమితో స్వదేశంలో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గంభీర్ సర్ ఇక మీ సేవలు చాలు అని కామెంట్స్ పెడుతున్నారు. గంభీర్‌ను కోచ్ పదవి నుంచి వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రికార్డు గొప్పగా లేదనే చెప్పాలి. టీ20 ఫార్మాట్‌లో భారత్ మంచి విజయాలు సాధించినప్పటికీ.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నా.. అదే సమయంలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లను కోల్పోయింది. అంతేకాదు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో వైట్‌వాష్, బోర్డర్–గావస్కర్ ట్రోఫీ 2025 పరాజయం, విరాట్ కోహ్లీ–రోహిత్ శర్మలను టెస్టుల నుంచి రిటైర్ అయ్యేలా చేయడం, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో దాదాపు ఓటమి, రోహిత్ శర్మ కెప్టెన్సీని తీసేయడం, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఓటమి, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో వైట్‌వాష్, సేనా జట్లపై వరుసగా ఐదు హోం టెస్టుల్లో పరాజయం.. ఇలా అన్నీ ప్రతికూలతలే ఉన్నాయి.
Also Read: Fake Ratings and Reviews: రేటింగ్ చూసి కొనేస్తున్నారా..? ఆన్‌లైన్ షాపింగ్‌లో అతిపెద్ద స్కామ్..!
భారత్‌కు వచ్చే ఐదు నెలల పాటు మరో వన్డే మ్యాచ్ లేదు. ఇప్పుడు టీమిండియా దృష్టి మొత్తం ఫిబ్రవరి 7 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2026పై ఉంది. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ భారత జట్టుకు సరైన కోచ్‌నా? అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2027 వన్డే వరల్డ్ కప్‌లను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ ప్రశ్న మరింత కీలకంగా మారుతోంది. ఈ ఐదు నెలల విరామంలో భారత సెలెక్టర్లు, బీసీసీఐ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జట్టు కూర్పులోనే కాదు మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి భారత క్రికెట్‌లో కొత్త చర్చలకు దారితీస్తోంది.
