భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. గత ఏడాది టీ20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇది అనూహ్య నిర్ణయం. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. భవిష్యత్‌లోనూ ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకువెళ్లడంలో కోహ్లీ కీలక సభ్యుడిగా ఉంటాడు. విరాట్ అద్భుత ఆటగాడు. వెల్‌డన్’ అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు.
Read Also: కోహ్లీ ప్రకటనపై స్పందించిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే
అయితే గతంలోనూ వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ను తప్పించిన సమయంలో బీసీసీఐకి, కోహ్లీకి మధ్య ఓ వార్ నడిచింది. టీ20ల కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పుకోవద్దని తాము రిక్వెస్ట్ చేశామని గంగూలీ చెప్పగా.. ఆ వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు. ఆ సమయంలో తననెవరూ కెప్టెన్‌గా కొనసాగమని చెప్పలేదన్నాడు. వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించేముందు గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని కోహ్లీ ఆరోపించాడు. దీంతో బీసీసీఐ, కోహ్లీ మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుమానించారు. ఇప్పుడు మరోసారి కోహ్లీ అకస్మాత్తుగా టెస్టుల నుంచి కెప్టెన్‌గా తప్పుకోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
