BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మరో మూడేళ్లు పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు రూట్ క్లియర్ చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. లోధా కమిటీ సిఫారసుల్లో మార్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో వాళ్లకు ఈ అవకాశం దక్కింది. కూలింగ్ పీరియడ్ రూల్‌తో పాటు 70 ఏళ్ల వయో పరిమితిని కూడా తొలగించేలా రాజ్యంగ సవరణ చేసేందుకు అనుమతించాలని బోర్డు దాఖలు చేసిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో బీసీసీఐ తరఫున మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ ఎవరైనా కూడా స్టేట్ అసోసియేషన్ పాలకమండలిలోనైనా, బీసీసీఐలోనైనా లేదా రెండింటిలోనూ మూడేళ్ల చొప్పున(రెండు దఫాలు) పదవులు చేపడితే.. తదుపరి దఫాలో పని చేయకూడదు. మూడేళ్ళు విరామం తీసుకున్నాక పోటీ చేయాలి. అటు స్టేట్ అసోసియేషన్‌లో.. ఇటు బీసీసీఐలో పదవుల్లో ఉన్నట్లయితే.. రెండు దఫాలు బాధ్యతలు చేపట్టినట్లే.. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా పదవులకు రాజీనామా చేయాలి. అయితే ఇప్పుడు ఈ నిబంధనను బీసీసీఐ రాజ్యాంగం నుంచి తొలగించడం.. సుప్రీం కోర్టు అందుకు ఆమోదించడంతో గంగూలీ, జై షా పదవులకు మరికొంతకాలం ఢోకా లేకుండా పోయింది.
