ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం.
ఈ జాబితాలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్, డుప్లెసిస్, రబాడ, ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, డికాక్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరి కనీస ధర రూ.2 కోట్లు. అయితే వీరికి రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఫ్రాంచైజీలు కుమ్మరించనున్నాయి. ఆయా ఆటగాళ్ల దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమ జట్లకు ఆడిన ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. రిటైన్ పక్రియలో అవకాశం లేకపోవడంతో వాళ్లను తీసుకోలేకపోయామని.. వేలంలో కచ్చితంగా వాళ్లను సొంతం చేసుకుంటామని ఆయా ఫ్రాంచైజీలు చెప్తున్నాయి. ఈ మేరకు ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, డుప్లెసిస్‌ను చెన్నై సూపర్‌కింగ్స్, డికాక్‌ను ముంబై ఇండియన్స్ జట్లు సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.
