ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఊహించిందే జరిగింది. మట్టి కోర్టులో రారాజు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. వరల్డ్ నెంబర్ వన్‌కు షాకిచ్చి పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6-2, 4-6, 6-2, 7-6 (7-4) తేడాతో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌పై విజయం సాధించాడు నాదల్. సెర్బియాకు చెందిన జకోవిచ్ ప్రస్తుతం పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్. అయితే, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో నాదల్‌ను కొట్టేటోడు ప్రస్తుతం లేడు.
చివరకు తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో టైటిల్ పై కన్నేసిన నాదల్ రికార్డు స్థాయిలో 15వ సారి సెమీఫైనల్ చేరుకున్నాడు. గత ఏడాది సెమీఫైనల్లో ఓటమికి జకోవిచ్‌పై ఈ మ్యాచ్ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు నాదల్. ఫ్రెంచ్ ఓపెన్ 2022లో మరో క్వార్టర్స్ లో కార్లోస్ అల్కరాస్‌పై విజయంతో అలెగ్జాండర్ జ్వెరేవ్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. ఫైనల్ బెర్త్ కోసం తొలి సెమీఫైనల్లో నాదల్, జ్వెరేవ్ తలపడనున్నారు. నాదల్ ఇదివరకే 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గగా.. ఓవరాల్ కెరీర్‌లో 21 టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.