NTV Telugu Site icon

Andrew Flintoff: రోడ్డుప్రమాదంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌కు తీవ్రగాయాలు.. ఇది రెండోసారి

Andrew Flintoff

Andrew Flintoff

Andrew Flintoff: ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ మరోసారి ఘోర రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. 2010లో ఫ్లింటాఫ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి టెలివిజన్ రియాలిటీ షోలలో రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడు. 2019లో ప్రఖ్యాత బీబీసీ స్పోర్ట్స్ షో ‘టాప్ గేర్‌’లో హోస్ట్‌గా చేరాడు. సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌లో సోమవారం ఫ్లింటాఫ్ కారు ప్రమాదానికి గురైంది. షో టెస్ట్ ట్రాక్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఫ్లింటాఫ్‌ను అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఫ్లింటాఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా టాప్ గేర్ కారు రేసింగ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఫ్లింటాఫ్‌కు ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో తనతోపాటు రేస్‌ను హోస్ట్ చేస్తున్న వారితో కలిసి ఫ్లింటాఫ్ కారు రేస్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో గంటకు 125 కి.మీ. వేగంతో వాహనాన్ని నడుపుతుండగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కూడా ఫ్లింటాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు.

Read Also: Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్

ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు మ్యాచ్‌లలో ఫ్లింటాఫ్ ఆడాడు. టెస్టుల్లో 3845 పరుగులు, 226 వికెట్లు.. వన్డేల్లో 3394 పరుగులు, 169 వికెట్లు.. టీ20ల్లో 76 పరుగులు, 5 వికెట్లు పడగొట్టాడు. 2005లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం బాక్సింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవాలని అతడు భావించాడు. ప్రస్తుతం డ్రాగ్ రేస్‌లో హోస్ట్‌గా చేస్తున్నాడు.