Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: 20 ఏళ్లుగా దర్శించుకుంటున్నా.. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం!
తాజాగా, మాజీ పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్, పాక్ ప్లేయర్లను దారుణంగా విమర్శించారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో ఓడించడం తర్వాత పాక్ భారత్‌తో అన్ని వన్డేల్లో ఓడిపోయింది. భారత్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ ప్లేయర్ల ‘‘ఆహారం’’ విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అది ఫస్ట్ లేదా సెకండ్ డ్రింక్స్ బ్రేక్ అనుకుంటా. ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉన్నాయి. అది వారి ఆహారం. కోతులు కూడా అంతగా అరటిపండ్లు తినవు. ఒక వేళ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అయి ఉంటే, అతను నన్ను కొట్టే వాడే’’ అని వసీం అక్రమ్ మ్యాచ్ అనంతర కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఆ రోజు మ్యాచ్ సమయంలో బౌలర్ల కోసం రెండు ట్రేలలో అరటి పండ్లు వచ్చాయి, కోతులు కూడా ఇన్ని అరటి పండ్లు తినవని చెప్పాను అని ఆయన అన్నారు.
మానవ పరిణామం కోతుల నుంచి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ ఆ దిశగా మాత్రమే వెళ్తోందని ఎద్దేవా చేశారు. ఆట వేగం అనేక రెట్లు పెరిగినప్పటికీ, పాకిస్తాన్ ఇంకా ప్రాచీన కాలం నాటి క్రికెట్ మాత్రమే ఆడుతోందని విమర్శించారు. పాక్ క్రికెట్ మారాలంటే భయం లేని క్రికెటర్లను, యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని చెప్పారు. మీరు రాబోయే ఆరు నెలలు ఓడిపోతూనే ఉంటారు, కానీ 2026 టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును తయారు చేయడం ప్రారంభించాలని పాక్ బోర్డుకు హితవు పలికారు.