Site icon NTV Telugu

ఐపీఎల్‌కు మరో ఇంగ్లండ్ ఆటగాడు దూరం

ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌ ఓటమి ఇంగ్లండ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టులకు కాకుండా టీ20లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావాలని పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ అరంగేట్రం చేయాలని అతడు భావించినా యాషెస్ సిరీస్ ఓటమి కారణంగా తన జాతీయ జట్టుకు చేయాల్సింది చాలా ఉందని… అందుకోసం తాను ఎంతటి త్యాగమైనా చేస్తానంటూ ఐపీఎల్ వేలంను ఉద్దేశించి రూట్ మాట్లాడాడు.

Read Also: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్… విదేశీ గడ్డపై తొలి వన్డే సిరీస్ విజయం

అయితే జో రూట్ బాటలోనే ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని భావించాడు. స్వదేశంలో వచ్చే క్రికెట్ సీజన్‌ కోసం మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలనే లక్ష్యంతో స్టోక్స్‌ ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. గతంలో ఐపీఎల్‌లో బెన్ స్టోక్స్‌ రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో రాజస్థాన్ జట్టు బెన్ స్టోక్స్‌ను వదిలేసింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన రెండో ఫేజ్ ఐపీఎల్‌లో స్టోక్స్ ఆడలేదు. దీంతో జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఈ కారణాలతోనే రాజస్థాన్ జట్టు స్టోక్స్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version