David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్‌ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!

  • పీఎస్ఎల్‌ 2026 ప్రారంభానికి ముందే మరో ఆసక్తికర ఘటన
  • కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వార్నర్ ఫైర్
  • ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు
Warner press conference

Warner press conference

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజన్ ప్రారంభానికి ముందే మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహించిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తాను సిరియస్‌గా మాట్లాడుతుండగా.. ఇతర జట్ల కెప్టెన్లు సరదాగా ముచ్చటించుకోవడంతో వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని ‘స్కూల్ పిల్లలు’ అని వ్యాఖ్యానించాడు.

పీఎస్ఎల్‌ ప్రెస్ మీట్‌లో డేవిడ్ వార్నర్‌తో పాటు మార్నస్ లబుషేన్, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ పాల్గొన్నారు. వార్నర్ తన జట్టు ప్రణాళికల గురించి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న కెప్టెన్లు సరదాగా చర్చించుకుంటూ ఉండటం అతనికి అసౌకర్యంగా అనిపించింది. దీంతో ‘ఇక్కడ ఏమవుతోంది?. క్షమించండి, ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్లు తమను తాము ప్రీమియం అంటున్నారు కానీ.. అసలు వాళ్లు పిల్లల్లానే ప్రవర్తిస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎలా కూర్చోవాలో, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ప్రవర్తనలో కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా సూచించాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

పీఎస్ఎల్‌ 2025లో డేవిడ్ వార్నర్ కరాచీ కింగ్స్‌కు నాయకత్వం వచించాడు. 11 మ్యాచ్‌లలో 368 పరుగులు చేశాడు. అతని నాయకత్వంలో జట్టు మూడో స్థానంలో నిలిచినా.. ఎలిమినేటర్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక పీఎస్ఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ.. క్రికెట్ కంటే ఎక్కువగా ఇతర కారణాలతో హైలైట్ అవుతోంది. ముఖ్యంగా ఇంధన సంక్షోభం, యాజమాన్య నిర్ణయాలు, ప్లేయర్స్ తప్పుకోవడం, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జరిగిన ఘటనలు పీఎస్ఎల్‌ ప్రతిష్టపై ప్రభావం చూపుతున్నాయి.

పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం ఏర్పడింది. దాంతో ఈసారి పీఎస్ఎల్ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా (క్లోజ్డ్ డోర్స్) నిర్వహిస్తున్నారు. ఈసారి టోర్నమెంట్‌ను ఆరు వేదికల నుంచి కేవలం రెండు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. లాహోర్, కరాచీ నగరాల్లోనే అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రారంభ వేడుకను కూడా రద్దు చేయడం మరో ముఖ్య పరిణామంగా మారింది. టోర్నీ మార్చి 26న ప్రారంభమై మే 3న ఫైనల్‌తో ముగియనుంది. మైదానంలో ఈ సీజన్ ఎలా సాగుతుందో చూడాలి.