CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!

Csk Appeals

Csk Appeals

CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, ఇదే రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం తమ అభిమానులకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. తమిళనాడులో అటు సీఎస్‌కే జట్టుకు, ఇటు ‘దళపతి’ విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ వేడుక, ఐపీఎల్ మ్యాచ్ ఒకే రోజు కావడంతో స్టేడియంలో ఎలాంటి రాజకీయ రంగు పడకుండా చూడాలని సీఎస్‌కే కోరింది. “మా సూపర్ ఫ్యాన్స్‌కు ఒక విన్నపం.. స్టేడియానికి వచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదా వ్యక్తికి సంబంధించిన బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్‌లు తీసుకురావద్దు. కేవలం క్రికెట్‌ను మాత్రమే ఆస్వాదించండి” అని సీఎస్‌కే తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

ఇదిలా ఉండగా.. గత నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి విజయ్ గవర్నర్‌తో చర్చలు జరిపి, మిత్రపక్షాల మద్దతు కూడగట్టారు. శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన విజయ్.. కాంగ్రెస్ (5), వీసీకే (2), సీపీఐ (2), సీపీఐ-ఎం (2), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (2) ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలియజేశారు. దీనితో 51 ఏళ్ల ఈ నటుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ సీజన్‌లో బ్యాటింగ్ వైఫల్యాలు, నిలకడలేని ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సేన, పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి టాప్-4 దిశగా అడుగులు వేయాలని పట్టుదలతో ఉంది. లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకోవడంతో చెన్నైకి ఇకపై ప్రతి మ్యాచ్ చావో రేవో లాంటిదే.