Cheteshwar Pujara Dropped from IND vs WI Test Series: టెస్టుల్లో టాప్ ఆర్డర్ చాలా కీలకం. అందులోనూ మూడో స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఓపెనర్ త్వరగా ఔట్ అయితే క్రీజ్‌లో నిలబడి పరుగులు చేయాల్సిన బాధ్యత ఫస్ట్ డౌన్ బ్యాటర్‌పై ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత జట్టుని ఆదుకున్నాడు. బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ద్రవిడ్.. ‘ది వాల్’ అనే పేరును సంపాదించాడు. ద్రవిడ్ అనంతరం ఆ స్థానాన్ని చెతేశ్వర్ పుజారా భర్తీ చేశాడు. 2010లో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పుజారా.. అతి తక్కువ కాలంలో అద్భుత ఆటతో ‘నయా వాల్’ అనే బిరుదు సంపాదించాడు. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన పూజి.. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి టీంకు దూరమయ్యాడు. పుజారా కెరీర్ (Cheteshwar Pujara Retirement) దాదాపు ముగిసినట్లే అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ జట్టుని ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానె వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. ‘నయా వాల్’ చెతేశ్వర్ పుజారాపై వేటు పడింది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో.. ఈ ఇద్దరు యువ బ్యాటర్లకు టెస్టు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.
వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు చెతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడంతో ‘నయా వాల్’ కెరీర్ ముగిసినట్లే? అని ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత మూడేళ్లుగా పూజి పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతంలో స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు పుజారాను ఎంపిక చేయలేదు. కౌంటీల్లో భారీ స్కోర్లు సాధించి.. జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడి కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విఫలం అయినా.. అతడిపై ఉన్న నమ్మకంతో కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది.
Also Read: Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్స్ ఖర్జూరాలు తినొచ్చా.. షుగర్ లెవెల్స్ పెరుగుతాయా?!
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 రెండు ఇన్నింగ్స్‌లలో చెతేశ్వర్ పుజారా 14, 27 పరుగులు మాత్రమే చేసి మరోసారి విడలమయ్యాడు. గత మూడేళ్లుగా పేలవ ఫామ్‌లో ఉన్నా.. సీనియర్, ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడనే గౌరవంతో భారత జట్టు మేనేజ్మెంట్ పుజారాను ఇప్పటివరకు కొనసాగించారు. ఈ మూడేళ్ల కాలంలో బంగ్లాదేశ్‌పై ఆడిన 90, 102 పరుగులను పక్కన పెడితే.. తన స్థాయికి తగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. యువ ప్లేయర్స్ సత్తాచాటుతుండడం, జట్టు భవిష్యత్తుపై బీసీసీఐ దృష్టి పెట్టడడంతో.. పుజారా మరోసారి జట్టులోకి రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ‘నయా వాల్’ కెరీర్ ముగిసినట్లే? అని తెలుస్తోంది.
చెతేశ్వర్ పుజారా భారత్ తరఫున 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. వన్డేల్లో పెద్దగా రాణించని పుజారా.. టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. విదేశీ గడ్డపై తన మార్క్ చూపెట్టాడు. 103 టెస్టుల్లో 43.60 సగటు, 44.4 స్ట్రైక్ రేట్‌తో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 206 నాటౌట్. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్‌లో ఉత్తమం. చివరిసారి ఆసీస్ పేసర్లు తమ పేస్ బౌలింగ్‌తో పుజారా శరీరానికి ఎన్ని బంతులు చేసినా క్రీజ్‌లో నిలబడడటం విశేషం.