Team India: టీమిండియా సీనియర్ క్రికెటర్ పుజారా చాన్నాళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఏమైనా జరగొచ్చు. అయితే పుజారా మాత్రం ఎంతో సహనం ప్రదర్శించి నిలకడగా ఆడుతున్నాడు. ఒకానొక దశలో జట్టులో స్థానం కోల్పోయినా మనోనిబ్బరం కోల్పోకుండా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. 2019 జనవరిలో సెంచరీ చేసిన పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై సెంచరీ బాది విమర్శకుల నోళ్లను మూయించాడు. 1,443 రోజుల తర్వాత పుజారా ఖాతాలో మరో సెంచరీ నమోదైంది. తొలి ఇన్నింగ్స్ శతకానికి దగ్గరగా వచ్చి 90 పరుగుల వద్ద అవుటైనా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఎలాంటి తప్పు చేయకుండా మూడంకెల స్కోరు అందుకున్నాడు.
Read Also: Andhra Pradesh: ఏపీ హైకోర్టులో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్
కాగా పుజారా కెరీర్‌లో ఇది 19వ సెంచరీ. అంతేకాకుండా పుజారా కెరీర్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కూడా. కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. అయితే పుజారా ఫామ్‌లోకి రావడానికి కారణం విదేశాల్లో ఆడటమే. ఎవరైనా ఫామ్ కోల్పోతే దేశవాళీ టోర్నీల్లో ఆడతారు. కానీ పుజారా కౌంటీలకు నిలయమైన యూకేలో ఆడాడు. అక్కడ సర్రే తరఫున వరుస మ్యాచ్‌లలో సెంచరీలు చేసి రాణించాడు. కానీ ఇవి టెస్ట్ మ్యాచ్‌లు కాదు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు. దీంతో వన్డేలకు కూడా తాను పనికొస్తానని సెలక్టర్లకు సంకేతాలు పంపాడు. మొత్తానికి బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రాణించిందంటే దానికి కారణం పుజారానే. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పుజారా ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పవచ్చు.