NTV Telugu Site icon

Cricket: ప్రపంచం ఓ వైపు.. టీమిండియా మరోవైపు.. మ్యాచ్ నిర్వహణకు కేంద్రం సన్నాహాలు

Bcci Min

Bcci Min

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు ఓ జట్టుగా, అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇండియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: Wimbledon: ఏడోసారి.. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత జొకోవిచ్

అయితే అంతర్జాతీయ ఆటగాళ్లతో మ్యాచ్ నిర్వహించాలంటే చాలా తతంగం ఉంటుందని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ చూసుకుని ఈ మ్యాచ్ నిర్వహణపై ఐసీసీతో మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కేంద్రం ప్రతిపాదనపై ఇంకా చర్చ జరుగుతోందని తెలిపారు. కేంద్రం ఈ మ్యాచ్ నిర్వహించాలని కోరుతున్న సమయంలో ఇంగ్లీష్‌ దేశవాళీ క్రికెట్‌, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరగనుందని గుర్తు చేశారు. అయితే భారత ఆటగాళ్లు మాత్రం ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌ నిర్వహణ సాధ్యమైతే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Show comments