NTV Telugu Site icon

Ben Stokes: పాకిస్థాన్‌కు బెన్ స్టోక్స్ భారీ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..?

Ben Stokes

Ben Stokes

Ben Stokes: ఇటీవల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మరో సమరానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఈ రెండు జట్ల మధ్య పాకిస్థాన్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటోంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ముందే బెన్ స్టోక్స్ పాకిస్థాన్ ప్రజల మనసు దోచుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే తన మ్యాచ్ ఫీజును మొత్తం పాకిస్తాన్‌లో ఈ ఏడాది వరద బాధితులకు అందజేయనున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. వరదల కారణంగా దెబ్బతిన్న నగరాల పునర్ నిర్మాణం కోసం ఈ డబ్బును వాడుకోవాలని అతడు ట్వీట్ చేశాడు.

Read Also: Ms Dhoni: ధోని స్టెప్ వేస్తే మాస్.. ధోని కాలర్ మడతేస్తే మాస్.. అయ్యా మాస్

మరోవైపు ఈ టెస్ట్ సిరీస్ కోసం 17 తర్వాత తమ జట్టు పాకిస్థాన్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని బెన్ స్టోక్స్ అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయని.. ఈ విపత్తు పాక్ ప్రజల జీవనాన్ని, దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని అతడు తన ట్వీట్‌లో తెలిపాడు. క్రికెట్ తన జీవితానికి కావాల్సింది ఇచ్చిందని.. వాటిని తిరిగివ్వడం సరైందని తన భావన అని పేర్కొన్నాడు. అందుకే ఈ టెస్ట్ సిరీస్ ద్వారా తనకు లభించే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పాకిస్థాన్ వరద బాధిత సహాయ కేంద్రానికి అందజేయాలని నిర్ణయించుకున్నట్లు స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఈ మూడు టెస్టుల సిరీస్ ద్వారా అతడు సుమారు రూ.37 లక్షల నగదును అందుకోనున్నాడు. ఈ మొత్తాన్ని పాకిస్థాన్ ప్రజలకు స్టోక్స్ విరాళంగా ఇవ్వనున్నాడు. డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్ట్, డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో రెండో టెస్టు, డిసెంబర్ 17 నుంచి కరాచీలో మూడో టెస్ట్ జరగనున్నాయి.

Show comments