Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్‌లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!

  • ఇంగ్లండ్ క్రికెట్‌లో కీలక పరిణామం
  • బెన్ స్టోక్స్‌కు భారీ షాక్
  • ఇంగ్లండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ
Ben Stokes Dropped

Ben Stokes Dropped

Ben Stokes Dropped From ENG vs NZ 2nd Test: ఇంగ్లండ్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్‌ను న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవల నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో సీనియర్ బ్యాటర్ జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇంగ్లండ్ జట్టును నడిపించనున్నాడు.

జూన్ 17 నుంచి ది ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు సంబంధించిన 15 మంది సభ్యుల జట్టును ఈసీబీ బుధవారం ప్రకటించింది. అయితే విచారణ కొనసాగుతున్న కారణంగా బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్.. ఓవల్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో ఓ రగ్బీ ఆటగాడు కూడా పాల్గొన్నాడు. ఈ ఘటన జట్టు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన ఈసీబీ.. వెంటనే విచారణ ప్రారంభించింది.

×
×
Ad

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే స్టోక్స్, అట్కిన్సన్‌లను రెండో టెస్టుకు ఎంపిక చేయకపోవడం ద్వారా బోర్డు కఠిన వైఖరిని ప్రదర్శించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరిపై మరిన్ని చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు అనుభవజ్ఞుడైన జో రూట్ నాయకత్వం వహించనున్నాడు. గతంలో కూడా ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్‌కు ఇది మరో అవకాశం కానుంది. కీలక సమయంలో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను తిరిగి ఎంపిక చేశారు. అలాగే ఎస్సెక్స్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌కు కూడా అవకాశం లభించింది. ఈ మార్పులతో న్యూజిలాండ్‌పై సిరీస్‌లో ఆధిక్యాన్ని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని, అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన కూడా చేస్తున్నట్లు బ్రిటిష్ మీడియా తమ కథనాలో పేర్కొన్నాయి. అయితే దీనిపై స్టోక్స్ లేదా ఈసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.