Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaryavir Sehwag Comments To Father Virender Sehwag: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి బౌండరీ సాధించిన భారత్.. తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో నెలకొన్న ఉత్కంఠ ఆటగాళ్లతో పాటు అభిమానులనూ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే ఆ సమయంలో తన మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో భారత యువ బ్యాటర్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ వెల్లడించాడు. టెన్షన్ తట్టుకోలేక ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించానని చెప్పాడు.
భారత్ టైటిల్ గెలిచిన అనంతరం ఆర్యవీర్ తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌తో వీడియో కాల్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఫైనల్ చివరి ఓవర్లో ఎంత ఉత్కంఠకు గురయ్యాడో వివరించాడు. ‘నాన్నా.. నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. అందుకే సీతారాం.. సీతారాం అంటూ జపిస్తూనే ఉన్నాను’ అని ఆర్యవీర్ చెప్పాడు. ఈ వీడియోను వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. వీడియో కాల్లో ఆర్యవీర్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా తన తండ్రితో పంచుకున్నాడు. మ్యాచ్ సమయంలో తనకు గాయమైందని, ఫిజియో మూడు నాలుగు సార్లు వచ్చి పరీక్షించాడని తెలిపాడు. అంతేకాదు, భారత బ్యాటింగ్‌ను పాకిస్థాన్ అభిమానులు కూడా ఆస్వాదించారని చెప్పాడు. స్టేడియంలో కొందరు పాక్ అభిమానులు ‘సెహ్వాగ్.. సెహ్వాగ్’ అంటూ నినాదాలు చేశారని వెల్లడించాడు. భారత ఆటగాళ్ల బ్యాటింగ్‌ను వారు ఆసక్తిగా వీక్షించడం తనకు సరదాగా అనిపించిందని ఆర్యవీర్ చెప్పాడు.
Also Read
- WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
- Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
- Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
- Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
కుమారుడి మాటలు విన్న వీరేంద్ర సెహ్వాగ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో ఆర్యవీర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకోవడం మరో విశేషం. భారత్ టైటిల్ సాధించిన ఆనందంతో పాటు కుమారుడు సాధించిన గుర్తింపు సెహ్వాగ్‌కు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న సెహ్వాగ్.. అవార్డులు, పరుగులు, ట్రోఫీల కంటే ఇలాంటి జ్ఞాపకాలే తల్లిదండ్రులకు ఎంతో విలువైనవని పేర్కొన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకోవడం నుంచి ఫైనల్లోని ఉత్కంఠభరిత క్షణాలను గుర్తుచేసుకోవడం వరకు.. నా కుమారుడితో జరిగిన ఈ సంభాషణ ఎంతో ప్రత్యేకం. కొన్ని క్షణాలు అవార్డులు, పరుగులు, ట్రోఫీల కంటే గొప్పవి. తండ్రి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు ఇవి. ఎప్పుడూ ఒదిగి ఉంటూ.. నీ కష్టంతో, ప్రతిభతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్‌తో ఫైనల్లో చివరి ఆరు బంతుల్లో భారత్ విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. పాక్ బౌలర్ అహ్మద్ హుస్సేన్ బౌలింగ్‌కు దిగగా.. క్రీజులో చివరి జోడీ మోహిత్ ఉల్వా, మనల్ చౌహాన్ ఉన్నారు. తొలి బంతికి పరుగులేమీ రాలేదు. ఆ తర్వాత ఉల్వాను స్టంపౌట్ చేసే అవకాశం కూడా పాకిస్థాన్‌కు లభించింది. అయితే ఆ బంతి వైడ్ కావడంతో భారత్‌కు ఊరట లభించింది. ఆ తర్వాత మనల్ , మోహిత్ వరుసగా సింగిల్స్ తీసుకున్నారు. దీంతో చివరి బంతికి భారత్ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ ఫలితం ఆ ఒక్క బంతిపైనే ఆధారపడిన వేళ.. మోహిత్ మరిచిపోలేని షాట్ ఆడాడు. అహ్మద్ హుస్సేన్ వేసిన చివరి బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీకి తరలించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసిన ఉల్వా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
ట్రెండింగ్
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..