ఈనెలాఖరులో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు టీమిండియాతో మూడు టీ20లతో పాటు రెండు టెస్టులను శ్రీలంక ఆడనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్టులు, తర్వాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ సవరించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది.
ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న రెండో టీ20, 27న మూడో టీ20 జరగనున్నాయి. తొలి టీ20 లక్నో వేదికగా, మిగతా రెండు మ్యాచ్‌లు ధర్మశాల వేదికగా జరగనున్నాయి. అటు తొలి టెస్ట్ మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు జరుగుతుంది. రెండో టెస్ట్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. కాగా బుధవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ ముగియగానే శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.
