NTV Telugu Site icon

BCCI: పంత్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఆడకపోయినా పూర్తి జీతం చెల్లింపు

Rishab Pant

Rishab Pant

BCCI: రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఈ సీజన్‌లో పంత్‌ ఆడకపోయినా పూర్తి జీతం అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ ఆటగాడైన పంత్‌కు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. ఈ మొత్తాన్ని బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్‌కు రావాల్సిన రూ.16 కోట్లను నిబంధనల ప్రకారం జట్టుతో ఒప్పందం చేసుకున్న బీమా సంస్థ చెల్లించేలా సదరు ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Read Also: KE Kumar: జాతీయ కారు రేసింగ్‌లో విషాదం.. రేసర్ కుమార్ మృతి

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దాదాపు దూరమైనట్లే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 ఆడకపోయినా అతడికి నగదు మొత్తం చెల్లించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు రాబోయే 8-9 నెలల పాటు పంత్ ఆటకు దూరం కానున్నాడు. అతడు ఆడకపోయినా ఆర్ధికంగా అండగా నిలవాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయిందని.. ప్రస్తుతం అతడు అబ్జర్వేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. తర్వాత అతనికి చేయాల్సిన చికిత్స, రీహాబిలేషన్‌ ప్లాన్‌ను డాక్టర్ దిన్‌షా పర్దీవాలా సూచిస్తారని వివరించింది. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీం నిత్యం పంత్‌ను పర్యవేక్షిస్తుందని బీసీసీఐ పేర్కొంది.