BCCI vs PCB: ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకొనేందుకు భారత్ అంగీకరించలేదు. యూఏఈ లేదా ఇతర సభ్యుల నుంచి దాన్ని తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయినా సరే మోసిన్ మొండిపట్టుదలతో ట్రోఫీని తీసుకుని.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇక, భారత జట్టుకు నఖ్వీ క్షమాపణలు చెప్పినా ఆ ట్రోఫీని మాత్రం ఇంకా అప్పగించలేదు. బీసీసీఐ లేదా టీమిండియా కెప్టెన్ నేరుగా తన దగ్గరకే వచ్చి ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో నఖ్వీని అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచే తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు టాక్.
Read Also: Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి
అయితే, ఆసియా కప్ ఏమీ మోసిన్ నఖ్వీ వ్యక్తిగత సొత్తు కాదని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నఖ్వీ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం కఠిన చర్యలకు భారత బోర్డు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ఇక, ఇప్పటికీ ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. అక్కడి నుంచి కదిలించొద్దని నఖ్వీ ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఎవరికీ అప్పగించకూడదని తన సిబ్బందికి చెప్పనట్లు తెలుస్తుంది. తన అనుమతి లేకుండా ప్రెజెంటేషన్ ఇవ్వొద్దని నఖ్వీ చెప్తున్నారని ఏసీసీ వర్గాలు వెల్లడించాయి.
