BCCI Elections: బీసీసీఐ ఎన్నికలకు నగరా మోగింది. ఈ మేరకు ఆదివారం నాడు బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ముంబైలో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అదే రోజున అధికారులు వెల్లడిస్తారు. ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు. అయితే గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని, జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా పీఠం ఎక్కుతారని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read Also:ఇండియాలో టాప్ 10 శీతాకాల పర్యాటక ప్రాంతాలు
కాగా బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గంగూలీ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారా లేదా జై షాకు అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి. నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 4 నాటికి నామినేషన్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 5న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 6, 7 తేదీల్లో ఎలక్టోరల్ రోల్‌లోని పేర్లపై అభ్యంతరాలను సమర్పిస్తారు. అక్టోబర్ 10న అభ్యంతరాలు, నిర్ణయాలను పరిశీలిస్తారు. అక్టోబర్ 13న నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 14న నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అక్టోబర్ 15న పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అక్టోబర్ 18న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు.