భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగర్కర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. అజిత్ అగర్కర్ సేవలపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ భారత పేసర్ ఆర్‌పీ సింగ్ తదుపరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది.
అజిత్ అగర్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ కాలపరిమితి ముగింపు దశకు చేరుకోవడంతో.. కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత జట్టుకు గతంలో కీలక విజయాలు అందించిన ఆర్‌పీ సింగ్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. క్రికెట్‌పై లోతైన అవగాహనతో పాటు యువ ఆటగాళ్లను గుర్తించే సామర్థ్యం ఆర్‌పీ సింగ్‌కు ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. భారత జట్టుకు 2007 టీ20 వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌పీ సింగ్.. 2018లో రిటైర్మెంట్ ఇచ్చాడు. రిటైర్మెంట్ తర్వాత విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. ఆటపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు.
Also Read: Rashmika Mandanna: శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి.. ఇప్పుడు జయమ్మ, రష్మిక ‘ది పెర్ఫార్మర్’!
ఆర్‌పీ సింగ్‌కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు అప్పగిస్తే భారత క్రికెట్‌కు కొత్త దిశ చూపించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అజిత్ అగర్కర్ కాంట్రాక్ట్‌పై తుది నిర్ణయం, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఆర్‌పీ సింగ్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడా అనే ఉత్కంఠ ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఆర్‌పీ సింగ్ భారత్ తరఫున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2007 నుంచి 2011 వరకు టీమిండియాకు ఆర్‌పీ సింగ్ ఆడాడు.
