Site icon NTV Telugu

T20 World Cup: బంగ్లాదేశ్ క్రికెటర్లు మారరా ? .. కోహ్లీ “ఫేక్ ఫీల్డింగ్” చేశాడంటూ ఆరోపణలు

Virat Kohli

Virat Kohli

Bangladesh Player Accuses Virat Kohli Of “Fake” Fielding: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. విజయం వైపు దూసుకెళ్తున్న బంగ్లాదేశ్ ను ఐదు పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ను ఓడించేందుకు వచ్చామని బీరాలు పలికిన బంగ్లా టీమ్ కు ఏడుపు ఒకటే తక్కువ. దీంతో ఓటమికి సాకులు వెతుకుతోంది బంగ్లాదేశ్.

Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం

భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ‘‘ఫేక్ ఫీల్డింగ్’’ చేశాడని ఆరోపించాడు బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హనన్. ఇది ఆన్ ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని ఆరోపిస్తున్నాడు. అంపైర్లు క్రిస్ బ్రౌన్, మరైస్ ఎరాస్మస్ ఘటనను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది తమ జట్టుకు ఐదు పరుగులను దూరం చేసిందని చెబుతున్నాడు. వర్షం కారణంగా 16 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ ను చేధించాల్సిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 146 పరుగుల చేసి ఓడిపోయింది. వర్షానికి ముందు వరకు లిట్టన్ దాస్ హిట్టింగ్ లో గెలుపుబాటలో ఉన్న బంగ్లా టీమ్, వర్షం తరువాత వరసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఒక సిక్స్, ఓ ఫోర్ బాదిన నూరుల్ హసన్ బంగ్లాదేశ్ ను చివరి వరకు గేమ్ లో ఉంచాడు. అయితే మ్యాచ్ గెలిపించలేకపోయాడు. దీంతో తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు.

నూరుల్ చెప్పిన విరాట్ కోహ్లీ ‘‘ ఫేక్ ఫీల్డింగ్’’ ఘటన ఏడో ఓవర్ లో జరిగింది. లిట్టన్ దాస్-నజ్ముల్ హెస్సెన్ శాంటో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతిని అర్ష్‌దీప్ సింగ్ డీప్ నుంచి వికెట్ కీపర్ కు బాల్ విసురుతాడు. మధ్యలో విరాట్ కోహ్లీ బంతిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు విసురుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఇద్దరు బ్యాటర్లు చూడలేదని.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ నూరుల్ విమర్శిస్తున్నాడు. ఐసీసీ రూల్ 41.5 ప్రకారం ఉద్దేశపూర్వకంగా మోసగించడం, బ్యాటర్ ను అడ్డుకోవడాన్ని నిషేధిస్తుంది. దీనిని అంపైర్లు గుర్తిస్తే డెడ్ బాల్ గా ప్రకటించి ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వవచ్చు. అయితే మ్యాచ్ అధికారులపై విమర్శలు చేసిన నూరుల్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version