Site icon NTV Telugu

Bangladesh: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్

Rubel Hossain

Rubel Hossain

Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్(32) టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తన రిటైర్మెంట్‌ గురించి పోస్ట్ చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని రూబెల్ హుస్సేన్ స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన రూబెల్.. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ టెస్ట్ తర్వాత మళ్లీ అతడికి జట్టులో చోటు దక్కలేదు. ఓవరాల్‌గా 27 టెస్టుల్లో బంగ్లాదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రూబెల్ హుస్సేన్ 36 వికెట్లు సాధించాడు. యువకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే తాను టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు రూబెల్ వివరించాడు.

Read Also:Prabhas: 12 ఏళ్ల తరువాత ప్రభాస్.. అప్పుడు నాన్న కోసం.. ఇప్పుడు పెదనాన్న కోసం

కాగా ఇటీవల బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసియా కప్‌లో ఘోరంగా విఫలం కావడంతో టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ముష్ఫీకర్ రహీమ్ తెలిపాడు. తాజాగా టెస్ట్ క్రికెట్‌కు రూబెల్ హుస్సేన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ రూబెల్‌కు అంతంత మాత్రంగానే అవకాశాలు దక్కుతున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న రూబెల్ వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న మెగా టోర్నీకి మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు. జట్టు మేనేజ్ మెంట్ యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలిస్తుండడంతో రూబెల్‌కు జట్టులో అవకాశాలు దక్కడం లేదు. ఏడాది కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున రూబెల్ ఆడకపోవడంతో అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి.

Exit mobile version