భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనిని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులోకి రానున్నాడు. బదోని బ్యాటర్ మాత్రమే కాదు.. ఆఫ్ స్పిన్నర్ కూడా.
మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వాషింగ్టన్ సుందర్‌కు ఎడమ వైపు దిగువ రిబ్ ప్రాంతంలో అసౌకర్యం ఏర్పడింది. దీంతో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన అనంతరం మధ్యలోనే మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే గాయం ఉన్నప్పటికీ సుందర్ ధైర్యం చూపించాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో నంబర్ 8లో బ్యాటింగ్‌కు దిగి.. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి అజేయంగా నిలిచాడు. సుందర్ పోరాటంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
వాషింగ్టన్ సుందర్ గాయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ స్పందించింది. అతని రికవరీకి సంబంధించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించింది. సుందర్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనికి అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న బదోని.. ఇప్పుడు భారత జట్టులో తన స్థానాన్ని నిరూపించుకునే అవకాశాన్ని అందుకున్నాడు.
భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని.
